జమ్మూ: హైదరాబాద్ ఆటగాళ్లు జమ్మూకాశ్మీర్‌పై అదరగొట్టారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అక్షత్ సేన భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. అమోల్ షిండే మూడు పరుగుల దూరంలో సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. రంజీ ట్రోఫీ గ్రూప్-సిలో భాగంగా ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ 118 ఓవర్లలో 514/8 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం జమ్మూకాశ్మీర్ 198 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
రాణించిన షిండే
మంగళవారం 341/4 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్, సెంచరీ హీరో రవితేజ (258 బంతుల్లో 179, 20 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రితం రోజు స్కోరుకు 26 పరుగులు జోడించి నిష్ర్కమించాడు. అమోల్ షిండే (104 బంతుల్లో 97, 13 ఫోర్లు) వన్డే తరహా ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఐదో వికెట్‌కు రవితేజ, షిండే 71 పరుగులు జత చేశారు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌లో హబీబ్ అహ్మద్ 21 పరుగులు చేయగా, అబ్సొలెం (12), మెహదీ హసన్ (9) నాటౌట్‌గా నిలిచారు. జమ్మూ బౌలర్లలో రసూల్ 4 వికెట్లు పడగొట్టగా, సమీవుల్లా, రామ్‌దయాళ్, బందీప్ సింగ్ తలా ఓ వికెట్ తీశారు.
బందీప్ అర్ధసెంచరీ
తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన కాశ్మీర్‌ను హైదరాబాద్ బౌలర్లు మెహదీ హసన్ (3/55), రవి కిరణ్ (2/32) దెబ్బ తీశారు. జమ్మూ బ్యాటింగ్‌లో బందీప్ సింగ్ (58) అర్ధసెంచరీతో రాణించగా, కెప్టెన్ పర్వేజ్ రసూల్ 24 పరుగులు చేశాడు. ఆట ముగిసే సమయానికి హర్దీప్ సింగ్ 32 పరుగులతో, సమీవుల్లా 30 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. చివరి రోజు ఆటలో హైదరాబాద్ బౌలర్లు విజృంభించి తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీయగలిగితే జట్టు విజయం సాధించవచ్చు. లేదంటే 3 పాయింట్లు దక్కే అవకాశముంది.
సంక్షిప్త స్కోర్లు
హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 514/8 డిక్లేర్డ్ (రవితేజ 179, విహారి 109, షిండే 97; రసూల్ 4/99)
జమ్మూకాశ్మీర్ తొలి ఇన్నింగ్స్: 198/6 (బందీప్ సింగ్ 58; మెహదీ హసన్ 3/55, రవికిరణ్ 2/32).
భారీ ఆధిక్యం దిశగా...
Published Tue, Dec 24 2013 11:52 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement