వడోదర: కెప్టెన్ హనుమ విహారి (118 బంతుల్లో 71 బ్యాటింగ్; 11 ఫోర్లు), రికీ భుయ్ (102 బంతుల్లో 53 బ్యాటింగ్; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలతో బరోడాతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్ర రెండో రోజు మెరుగైన స్థితిలో నిలిచింది. ఆదివారం ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. కేఎస్ భరత్ (38 బంతుల్లో 40; 5 ఫోర్లు) ధాటిగా ఆడి వెనుదిరగ్గా, డీబీ ప్రశాంత్ (14) విఫలమయ్యాడు.
విహారి, భుయ్ మూడో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 128 పరుగులు జత చేశారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 247/7 స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన బరోడా ఆటను తొందరగా ముగించడంలో ఆంధ్ర బౌలర్లు విఫలమయ్యారు. బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 373 పరుగులకు ఆలౌటైంది. స్వప్నిల్ సింగ్, అతీత్ సేఠ్ ఎనిమిదో వికెట్‌కు ఏకంగా 139 పరుగులు జోడించడం విశేషం.
అయ్యప్పకు 4 వికెట్లు దక్కగా... కార్తీక్, భార్గవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం ఆంధ్ర మరో 183 పరుగులు వెనుకబడి ఉంది. మరోవైపు సికింద్రాబాద్ జింఖానా మైదానంలో ఉత్తరప్రదేశ్, హైదరాబాద్ మధ్య జరగాల్సిన రంజీ మ్యాచ్ వరుసగా రెండో రోజూ రద్దయింది. మైదానం చిత్తడిగా ఉండటంతో ఒక్క బంతి ఆట కూడా సాధ్యపడలేదు.
Comments
Please login to add a commentAdd a comment