ఆంధ్ర దీటైన జవాబు
తొలి ఇన్నింగ్స్‌లో 96/0
బరోడా 302 ఆలౌట్
విజయనగరం: సొంతగడ్డపై గత రెండు మ్యాచ్‌ల్లో విశేషంగా రాణించిన ఆంధ్ర రంజీ జట్టు మూడో మ్యాచ్‌లోనూ అదే ఆటతీరును కనబరుస్తోంది. బరోడాతో జరుగుతున్న గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో రెండో రోజు ఆంధ్ర జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 38 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 96 పరుగులు సాధించింది. కేఎస్ భరత్ (127 బంతుల్లో 50 బ్యాటింగ్; 7 ఫోర్లు, 1 సిక్స్), ప్రశాంత్ కుమార్ (102 బంతుల్లో 38 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 234/7తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బరోడా జట్టు 302 పరుగులకు ఆలౌటైంది. స్వప్నిల్ సింగ్ (159 బంతుల్లో 74; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆంధ్ర బౌలర్లలో స్టీఫెన్‌కు నాలుగు వికెట్లు దక్కగా... అయ్యప్ప, శివకుమార్‌లకు రెండేసి వికెట్లు లభించాయి.
హైదరాబాద్ భారీ స్కోరు
మరోవైపు ధర్మశాలలో హిమాచల్‌ప్రదేశ్‌తో జరుగుతున్న గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు భారీ స్కోరు సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 252/3తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్ 434 పరుగులకు ఆలౌటైంది. అనిరుధ్ (99 బంతుల్లో 62; 5 ఫోర్లు), వికెట్ కీపర్ కొల్లా సుమంత్ (113 బంతుల్లో 53; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా... ఆశిష్ రెడ్డి (59 బంతుల్లో 42; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. హిమాచల్ ప్రదేశ్ బౌలర్లలో రిషి ధావన్ మూడు వికెట్లు తీయగా, రోనిత్ మోరె నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హిమాచల్‌ప్రదేశ్ జట్టు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసింది. అంకుశ్ బైన్స్ (51 బ్యాటింగ్), ప్రశాంత్ చోప్రా (33 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు.