ఆంధ్ర ఇన్నింగ్స్ విజయం
గోవాతో రంజీ ట్రోఫీ మ్యాచ్
ఇక నాకౌట్ అవకాశాలు హైదరాబాద్ చేతిలో
సాక్షి, ఒంగోలు: పేస్ బౌలర్ దువ్వారపు శివ కుమార్ (5/38) హడలెత్తించడంతో... గోవాతో జరిగిన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఇన్నింగ్స్ 136 పరుగుల ఆధిక్యంతో భారీ విజయాన్ని సాధించింది. ఆంధ్ర బౌలర్ల దూకుడుకు ఈ మ్యాచ్ మూడో రోజుల్లోనే ముగియడం విశేషం. ఓవర్‌నైట్ స్కోరు 187/8తో ఆదివారం తమ తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన గోవా మరో 11 పరుగులు జోడించి మిగతా రెండు వికెట్లను కోల్పోయి 198 పరుగులవద్ద ఆలౌటై ఫాలోఆన్‌లో పడింది.
రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆంధ్ర బౌలర్ల ధాటికి గోవా బ్యాట్స్‌మెన్ ఎక్కువసేపు క్రీజ్‌లో నిలువలేకపోయారు. తుదకు 81.4 ఓవర్లలో 214 పరుగులవద్ద ఆలౌటై ఇన్నింగ్స్ ఓటమిని చవిచూశారు. గోవా జట్టులో ఓపెనర్ అమోగ్ దేశాయ్ (112 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 57), వేదాంత్ నాయక్ (82 బంతుల్లో 8 ఫోర్లతో 37) ఫర్వాలేదనిపించారు. ఆంధ్ర బౌలర్లలో శివ కుమార్ ఐదు వికెట్లు పడగొట్టగా... స్టీఫెన్ మూడు, హరీష్, విజయ్ కుమార్ ఒక్కో వికెట్ తీశారు. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌ను 548/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.
హిమాచల్‌తో రంజీ: హైదరాబాద్ 297/1
సాక్షి, హైదరాబాద్: తన్మయ్ అగర్వాల్ (303 బంతుల్లో 14 ఫోర్లతో 105 బ్యాటింగ్), విహారి (229 బంతుల్లో 19 ఫోర్లు, సిక్సర్‌తో 138 బ్యాటింగ్) సెంచరీలు చేయడంతో... హిమాచల్‌ప్రదేశ్‌తో జరుగుతున్న గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్ దీటైన జవాబు ఇచ్చింది. మూడో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 106 ఓవర్లలో వికెట్ నష్టానికి 297 పరుగులు చేసింది. మరో ఓపెనర్ అక్షత్ రెడ్డి (9 ఫోర్లతో 48) త్రుటిలో అర్ధ సెంచరీని కోల్పోయాడు. హిమాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కాలంటే చివరిరోజు ఆ జట్టు మరో 215 పరుగులు చేయాలి. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్నాయి.
ఈ గెలుపుతో ఆంధ్ర ఖాతాలో ఏడు పాయింట్లు చేరాయి. ప్రస్తుతం ఆంధ్ర మొత్తం 29 పాయింట్లతో గ్రూప్ ‘సి’లో రెండో స్థానంలో ఉండగా... హిమాచల్‌ప్రదేశ్ 27 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక ఆంధ్ర నాకౌట్ ఆశలన్నీ హైదరాబాద్, హిమాచల్‌ప్రదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉన్నాయి.
ఒకవేళ ఈ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసి హిమాచల్‌ప్రదేశ్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభిస్తే మాత్రం ఆ జట్టు 30 పాయింట్లతో నాకౌట్ దశకు అర్హత సాధిస్తుంది. ఒకవేళ హైదరాబాద్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభిస్తే మాత్రం ఆంధ్ర జట్టు 29 పాయింట్లతో నాకౌట్ దశకు చేరుకుంటుంది. హిమాచల్‌ప్రదేశ్ 28 పాయింట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా అస్సాం జట్టు ఇప్పటికే 35 పాయింట్లతో నాకౌట్ దశకు అర్హత పొందింది.