
ఇండోర్: తొలి ఇన్నింగ్స్‌లో గిరినాథ్ రెడ్డి (6/29) హడలెత్తించగా... రెండో ఇన్నింగ్స్‌లో ఆ బాధ్యతను కోడిరామకృష్ణ వెంకట (కేవీ) శశికాంత్ (6/18) తీసుకున్నాడు. ఫలితంగా 2018–19 రంజీ ట్రోఫీ సీజన్‌ను ఆంధ్ర జట్టు ఘనవిజయంతో ముగించింది. గ్రూప్ ‘బి’ టాపర్ మధ్యప్రదేశ్‌తో వారి గడ్డపైనే జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర 307 పరుగుల ఆధిక్యంతో జయభేరి మోగించింది. బౌలర్ల విజృంభణ కారణంగా మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ ఫలితంతో ఆంధ్రకు ఆరు పాయింట్లు లభించాయి. ఓవరాల్‌గా తొమ్మిది జట్లున్న గ్రూప్ ‘బి’లో నిర్ణీత ఎనిమిది మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆంధ్ర ఒక విజయం, రెండు పరాజయాలు, ఐదు ‘డ్రా’లతో మొత్తం 17 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 198/7తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర 301 పరుగులవద్ద ఆలౌటైంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కరణ్ షిండే (215 బంతుల్లో 103 నాటౌట్; 16 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించి ఆంధ్రను ఆదుకున్నాడు.
కరణ్ షిండే తొమ్మిదో వికెట్‌కు మనీశ్ (67 బంతుల్లో 21; 2 ఫోర్లు)తో 53 పరుగులు... పదో వికెట్‌కు విజయ్ కుమార్ (27 బంతుల్లో 10; 2 ఫోర్లు)తో 50 పరుగులు జోడించడం విశేషం. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఈశ్వర్ పాండేకు మూడు వికెట్లు దక్కగా... గౌరవ్ యాదవ్, కుల్‌దీప్ సేన్, శుభం శర్మలకు రెండేసి వికెట్లు లభించాయి. 343 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్‌ను ఆంధ్ర పేస్ బౌలర్లు శశికాంత్, విజయ్ కుమార్ నిప్పులు చెరిగే బంతులతో వణికించారు. దాంతో మధ్యప్రదేశ్ 16.5 ఓవర్లలో కేవలం 35 పరుగులకే కుప్పకూలి దారుణంగా ఓడిపోయింది. శశికాంత్ 8 ఓవర్లలో 4 మెయిడిన్‌లు వేసి 18 పరుగులిచ్చి 6 వికెట్లు తీయగా... విజయ్‌కుమార్ 8.5 ఓవర్లలో 3 మెయిడిన్‌లు వేసి 17 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మధ్యప్రదేశ్ నుంచి చివరి బ్యాట్స్‌మన్ గౌరవ్ యాదవ్ గాయం కారణంగా బరిలోకి దిగలేదు. శశికాంత్, విజయ్ ధాటికి మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదుగురు ఖాతా తెరవలేదు. ఆర్యమాన్ బిర్లా (12; 2 ఫోర్లు), యశ్ దూబే (16; 3 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు.
Comments
Please login to add a commentAdd a comment