న్యూఢిల్లీ: కీలకమైన న్యూజిలాండ్ పర్యటనకు భారత సీనియర్ పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ దాదాపుగా దూరమైనట్లే. రంజీ ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా సోమవారం ఇషాంత్ శర్మకు గాయం కాగా... వైద్య పరీక్ష అనంతరం దాని తీవ్రత ఎక్కువేనని తేలింది. ‘ఇషాంత్ ఎంఆర్‌ఐ రిపోర్టు ప్రకారం అతని చీలమండలో గ్రేడ్ త్రీ పగులు వచ్చినట్లు తేలింది. ఇది చాలా తీవ్రమైంది. అతనికి కనీసం ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరం. జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాస చికిత్స తీసుకోవడం కూడా తప్పనిసరి’ అని ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) కార్యదర్శి వినోద్ తిహారా వెల్లడించారు. భారత్, న్యూజిలాండ్ మధ్య ఫిబ్రవరి 21న తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో అప్పటికి ఇషాంత్ కోలుకోవడం కష్టమే. ఇషాంత్ గాయంపై బీసీసీఐ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే అతనికి మరోసారి పరీక్షలు నిర్వహించిన తర్వాతే బోర్డు ఈ విషయంలో స్పందించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment