IND vs NZ 2nd Test: Wasim Jaffer Suggested Mohammed Siraj Might Replace Ishant Sharma: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా తొలి టెస్టు డ్రా అయిన నేపథ్యంలో రెండో మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఆఖరి వరకు ఊరించి విజయం దూరమైనా.. ముంబై టెస్టులో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రచిస్తోంది. ఇక రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి ముంబై టెస్టుకు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో తుది జట్టు కూర్పుపై టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. తొలి టెస్టులో విఫలమైన అజింక్య రహానేకు మరో అవకాశం ఇస్తే బాగుంటుందన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో సీనియర్‌ను కొనసాగించాలని సూచించాడు.
ఈ మేరకు ఈఎస్‌ఎన్‌క్రిక్‌ఇన్ఫోతో వసీం జాఫర్ మాట్లాడుతూ.. ‘‘అజింక్య రహానేను ఇప్పుడే జట్టు నుంచి తప్పించకూడదు. దక్షిణాఫ్రికా పర్యటనను దృష్టిలో పెట్టుకుని రహానే, పుజారాను పక్కనపెట్టే విషయం గురించి ఆలోచించడం తొందరపాటు అవుతుంది. కీలకమైన సిరీస్ ముందున్న నేపథ్యంలో వాళ్లిద్దరిని పక్కన పెట్టకూడదు. ఆ సిరీస్ ముగిసిన తర్వాతే ఎవరిని కొనసాగించాలి? ఎవరిని తప్పించాలన్న విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది’’ అని పేర్కొన్నాడు.
ఇక కాన్పూరు టెస్టులో విఫలమైన ఓపెనర్ మయాంక్ అగర్వాల్(13, 17 పరుగులు)ను తప్పించి... అతడి స్థానంలో వృద్ధిమాన్ సాహాతో ఓపెనింగ్ చేయించాలని సూచించాడు. అదే విధంగా ముంబై టెస్టుకు ఇషాంత్ శర్మ స్థానంలో హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను తీసుకుంటే బాగుంటుందని చెప్పుకొచ్చాడు. అయితే, పిచ్ స్వభావంపై ఇదంతా ఆధారపడి ఉంటుందని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లు లేదంటే ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతారన్న అన్నది వేచి చూడాల్సి ఉందన్నాడు. ఇక కాన్పూర్ టెస్టులో ఇషాంత్ శర్మ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడన్న సంగతి తెలిసిందే. కాగా డిసెంబరు 3-7 వరకు రెండో టెస్టు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.
Comments
Please login to add a commentAdd a comment