రాణించిన రవితేజ, అక్షత్ | Ranji trophy match hyderabad Ravi teja,Akshat sucessfully | Sakshi
Sakshi News home page

రాణించిన రవితేజ, అక్షత్

Published Sun, Nov 17 2013 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 12:40 AM

Ranji trophy match hyderabad Ravi teja,Akshat sucessfully

జింఖానా, న్యూస్‌లైన్: మహారాష్ట్రతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగుతోంది. బ్యాట్స్‌మెన్ వికెట్ కాపాడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో స్కోరు వేగం మందగించింది. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 98 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది.
 
 రవితేజ (204 బంతుల్లో 98; 13 ఫోర్లు) సెంచరీ అవకాశం చేజార్చుకోగా, కెప్టెన్ అక్షత్ రెడ్డి (204 బంతుల్లో 86; 13 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. మహారాష్ట్ర బౌలర్లలో అక్షయ్ దరేకర్‌కు 2 వికెట్లు దక్కాయి. ఆట ముగిసే సమయానికి విహారి (98 బంతుల్లో 39 బ్యాటింగ్; 6 ఫోర్లు)తో పాటు ఖాద్రీ (5 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ఆదివారం ఆటకు ఆఖరి రోజు కావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోకుండా చివరి రోజు హైదరాబాద్ ఏ మాత్రం పోరాడుతుందో చూడాలి.
 రవితేజ రనౌట్...
 
 53/0 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన హైదరాబాద్ కొద్ది సేపటికే సుమన్ (73 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ కోల్పోయింది. అయితే అక్షత్ రెడ్డి, రవితేజ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 137 పరుగులు జోడించారు. అక్షత్‌ను అవుట్ చేసి ఖురానా ఈ జోడిని విడదీశాడు. అనంతరం విహారితో కలిసి రవితేజ మరో కీలక ఇన్నింగ్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే ఈ దశలో అనవసరంగా రవితేజ రనౌటయ్యాడు. లేని పరుగు కోసం రవితేజ ప్రయత్నించగా విహారి స్పందించకపోవడంతో ఇద్దరూ ఒకే ఎండ్‌కు చేరుకున్నారు. దాంతో రవితేజ సెంచరీ మిస్సయ్యింది. ఆ వెంటనే సందీప్ (1) కూడా వెనుదిరిగాడు. అయితే విహారి, ఖాద్రీ కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement