చివరి టి20లో భారత్ ఘన విజయం
297 పరుగుల రికార్డు స్కోరు
133 పరుగులతో చిత్తయిన బంగ్లాదేశ్
సంజు సామ్సన్ సూపర్ సెంచరీ
హైదరాబాద్‌లో విజయదశమి రోజున సాయంత్రం...పండగ సంబరాలను కాస్త పక్కన పెట్టి క్రికెట్ వైపు వచి్చన అభిమానులు అదృష్టవంతులు! అటు స్టేడియంలో గానీ ఇటు ఇంట్లో గానీ మ్యాచ్ చూసినవారు ఫుల్ దావత్ చేసుకున్నట్లే! అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనను కనబర్చి భారత క్రికెటర్లు పారించిన పరుగుల ప్రవాహంతో పండగ ఆనందం రెట్టింపు అయిందంటే అతిశయోక్తి కాదు.
25 ఫోర్లు, 23 సిక్స్‌లు...ఈ 47 బౌండరీలతోనే ఏకంగా 232 పరుగులు...రెండు ఓవర్లు మినహా మిగతా 18 ఓవర్లూ పదికి పైగా పరుగులు వచి్చన పవర్‌ప్లే ఓవర్లే! 43 బంతులకే 100, 84 బంతులకే 200 వచ్చేశాయి...అలా వెళ్లిన స్కోరు 300కు కాస్త ముందు ఆగింది. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులు బద్దలు...సరికొత్త రికార్డులు నమోదు. అంతర్జాతీయ టి20ల్లో 28 ఇన్నింగ్స్‌ల తర్వాత కూడా 2 అర్ధసెంచరీలు, ఇరవై లోపు లోపు 20 స్కోర్లతో తన సెలక్షన్‌పై సందేహాలు రేకెత్తిస్తూ వచి్చన సంజు సామ్సన్ ఎట్టకేలకు అద్భుతం చేశాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు సహా అతని మెరుపు సెంచరీ హైలైట్‌గా నిలిచింది. అతి భారీ లక్ష్యం ముందుండగా ముందు చేతులెత్తేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లు ఆడి లాంఛనం ముగించింది.
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో సమరాన్ని భారత జట్టు సంపూర్ణ ఆధిపత్యంతో ముగించింది. టెస్టు సిరీస్‌ను 2–0తో గెలుచుకున్న టీమిండియా ఇప్పుడు టి20 సిరీస్‌ను కూడా 3–0తో సొంతం చేసుకుంది. గత మ్యాచ్‌లోనే 86 పరుగుల ఓటమి తర్వాత సిరీస్ కోల్పోయి కునారిల్లిన బంగ్లాకు చివరి పోరులో అంతకంటే పెద్ద దెబ్బ పడింది. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన చివరి టి20లో భారత్ 133 పరుగుల తేడాతో బంగ్లాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ముందుగా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సంజు సామ్సన్ (47 బంతుల్లో 111; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) కెరీర్‌లో తొలి సెంచరీ సాధించగా, కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 75; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఎప్పటిలాగే చెలరేగాడు. సామ్సన్, సూర్య రెండో వికెట్‌కు 70 బంతుల్లోనే 173 పరుగులు జోడించడం విశేషం. వీరిద్దరికి తోడు హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) రియాన్ పరాగ్ (13 బంతుల్లో 34; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కూడా దూకుడు కనబర్చడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులే చేయగలిగింది. తౌహీద్ హృదయ్ (42 బంతుల్లో 63 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), లిటన్ దాస్ (25 బంతుల్లో 42; 8 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. హార్దిక్ పాండ్యాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది.
6, 6, 6, 6, 6...
అభిషేక్ (4)ను తొందరగా అవుట్ చేయడం ఒక్కటే బంగ్లాకు దక్కిన ఆనందం. ఆ తర్వాత 69 బంతుల పాటు వారికి సామ్సన్, సూర్య చుక్కలు చూపించారు. తస్కీన్ ఓవర్లో సామ్సన్ వరుసగా 4 ఫోర్లు కొట్టగా, తన్‌జీమ్ ఓవర్లో సూర్య వరుసగా 3 ఫోర్లు, సిక్స్ బాదాడు. పవర్‌ప్లేలోనే జట్టు 82 పరుగులు చేసింది. 22 బంతుల్లో సామ్సన్ అర్ధసెంచరీని చేరుకున్నాడు. ఆ తర్వాత బంగ్లా స్పిన్నర్ రిషాద్ బాధితుడయ్యాడు. రిషాద్ తొలి ఓవర్లో వరుసగా 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన సామ్సన్...అతని తర్వాతి ఓవర్లో విధ్వంసం సృష్టించాడు. తొలి బంతికి పరుగు తీయని సామ్సన్ తర్వాతి ఐదు బంతుల్లో 6, 6, 6, 6, 6తో చెలరేగాడు. మరో వైపు 23 బంతుల్లో సూర్య హాఫ్ సెంచరీ పూర్తయింది. మహేదీ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్ తొలి బంతికి నేరుగా ఫోర్ కొట్టడంతో సామ్సన్ 40 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
ఎట్టకేలకు సెంచరీ తర్వాత సామ్సన్‌ను ముస్తఫిజుర్ వెనక్కి పంపడంతో బంగ్లా ఊపిరి పీల్చుకుంది. తర్వాతి ఓవర్లోనే సూర్య అవుటయ్యాడు. ఆ తర్వాతా భారత్‌ను నిలువరించడం బంగ్లా వల్ల కాలేదు. పాండ్యా తన జోరును చూపిస్తూ తన్‌జీమ్ ఓవర్లో వరుసగా 4, 6, 6, 4 కొట్టగా...మహేదీ ఓవర్లో పరాగ్ వరుసగా 6, 4, 6 బాదాడు. వీరిద్దరు 26 బంతుల్లోనే 70 పరుగులు జత చేశారు. మూడు బంతులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో క్రీజ్‌లోకి వచి్చన నితీశ్ కుమార్ రెడ్డి (0) తొలి బంతికే వెనుదిరగ్గా...300కు 3 పరుగుల ముందు భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో తౌహీద్, దాస్ నాలుగో వికెట్‌కు 38 బంతుల్లో 53 పరుగులు జోడించి కాస్త పోరాడటం మినహా చెప్పుకునేందుకు ఏమీ లేకపోయింది.
స్కోరు వివరాలు:
భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) మహేదీ (బి) ముస్తఫిజుర్ 111; అభిషేక్ (సి) మహేదీ (బి) తన్‌జీమ్ 4; సూర్యకుమార్ (సి) రిషాద్ (బి) మహ్ముదుల్లా 75; పరాగ్ (సి) దాస్ (బి) తస్కీన్ 34; పాండ్యా (సి) రిషాద్ (బి) తన్‌జీమ్ 47; రింకూ (నాటౌట్) 8; నితీశ్ (సి) మహేదీ (బి) తన్‌జీమ్ 0; సుందర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 297.
వికెట్ల పతనం: 1–23, 2–196, 3–206, 4–276, 5–289, 6–289.
బౌలింగ్: మహేదీ 4–0–45–0, తస్కీన్ 4–0–51–1, తన్‌జీమ్ 4–0–66–3, ముస్తఫిజుర్ 4–0–52–1, రిషాద్ 2–0–46–0, మహ్ముదుల్లా 2–0–26–1.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: పర్వేజ్ (సి) పరాగ్ (బి) మయాంక్ 0; తన్‌జీద్ (సి) వరుణ్ (బి) సుందర్ 15; నజ్ముల్ (సి) సామ్సన్ (బి) బిష్ణోయ్ 14; లిటన్‌దాస్ (సి) (సబ్) తిలక్ (బి) బిష్ణోయ్ 42; తౌహీద్ (నాటౌట్) 63; మహ్ముదుల్లా (సి) పరాగ్ (బి) మయాంక్ 8; మహేదీ (సి) పరాగ్ (బి) నితీశ్ 3; రిషాద్ (సి) అభిషేక్ (బి) బిష్ణోయ్ 0; తన్‌జీమ్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 164.
వికెట్ల పతనం: 1–0, 2–35, 3–59, 4–112, 5–130, 6–138, 7–139.
బౌలింగ్: మయాంక్ 4–0–32–2, పాండ్యా 3–0–32–0, సుందర్ 1–0–4–1, నితీశ్ 3–0–31–1, రవి 4–1– 30–3, వరుణ్ 4–0–23–0, అభిషేక్ 1–0–8–0.
Comments
Please login to add a commentAdd a comment