
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా కొత్త ఓపెనింగ్ జోడీతో ముందుకు వెళ్లనున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ భారత ఇన్నింగ్స్ ఆరంభిస్తాడని తెలిపాడు. అంతేకాదు.. మయాంక్ యాదవ్ ఈ సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాడు.
సూర్యకుమార్ సారథ్యంలో
కాగా రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు వచ్చింది. ఈ క్రమంలో చెన్నై, కాన్పూర్ టెస్టుల్లో గెలుపొందిన రోహిత్ సేన.. సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ క్రమంలో సూర్యకుమార్ సారథ్యంలో టీమిండియా టీ20లకు సిద్దమైంది. ఇరుజట్ల మధ్య ఆదివారం గ్వాలియర్‌లో తొలి మ్యాచ్ జరుగనుంది.
టీ20 మ్యాచ్‌కు సరిపోయే పిచ్
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ తమ ప్రణాళికల గురించి వెల్లడించాడు. ‘‘ఈసారి అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. ఇక మేము ఇక్కడ రెండు రోజులు ప్రాక్టీస్ చేశాం. అయితే, వికెట్ మరీ లోగా, స్లోగా ఏమీ లేదు. కొంతమంది మూడు రోజులు కూడా ఇక్కడ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు.
వికెట్‌లో ఎవరికీ పెద్దగా తేడా ఏమీ కనిపించలేదు. టీ20 మ్యాచ్‌కు సరిగ్గా సరిపోయే పిచ్ ఇది. అయితే, మ్యాచ్ ఏకపక్షంగా మాత్రం ఉండబోదనే అనుకుంటున్నాం’’ అని సూర్య తెలిపాడు. ఇక తొలిసారిగా టీమిండియాకు ఎంపికైన యువ పేసర్ మయాంక్ యాదవ్ గురించి ప్రస్తావనకు రాగా.. అతడిని ‘ఎక్స్ ఫ్యాక్టర్’గా సూర్యకుమార్ అభివర్ణించాడు.
అతడొక ఎక్స్ ఫ్యాక్టర్
‘‘ప్రస్తుతం జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లే ఉన్నారు. వారిలో ఎవరి ప్రత్యేకత వారిది. ఇక మయాంక్ విషయానికొస్తే.. అతడు ఎక్కువగా నెట్స్‌లో ప్రాక్టీస్ చేయలేదు. అయితే, మయాంక్ ఆట తీరు ఎలా ఉంటుందో అందరూ ఇప్పటికే చూశారు.
అతడి రాక వల్ల జట్టు బౌలింగ్ విభాగానికి అదనపు బలం చేకూరుతుందనడంలో సందేహం లేదు. అతడొక ఎక్స్ ఫ్యాక్టర్‌గా కనిపిస్తున్నాడు. ఫ్రాంఛైజీ క్రికెట్‌లో అతడి ఎక్స్ ట్రా పేస్‌ను మనం చూశాము. కాబట్టి మయాంక్‌పైనే అందరి దృష్టి ఉంది.
జట్టులోని మిగతా యువ ఆటగాళ్లు కూడా తమను తాము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనా మయాంక్ జట్టుతో చేరడం శుభసూచకం. టీమిండియాకు అతడి వల్లే మేలు జరుగుతుందని భావిస్తున్నా’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.
గాయం నుంచి కోలుకుని
కాగా ఈ ఏడాది ఐపీఎల్-2024లో అరంగేట్రం చేశాడు ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ మయాంక్ యాదవ్. లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడిన రెండు మ్యాచ్‌లలో గంటకు 150కి పైగా కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు.
అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అతడు బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఐపీఎల్ సందర్భంగా గాయపడిన అతడు ప్రస్తుతం పూర్తిస్థాయిలో కోలుకుని ఆటలో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.
చదవండి: ‘టీమిండియా డ్రెస్సింగ్‌రూంలో గడపడం వల్లే ఇలా’
🗣️ It's a good opportunity for the youngsters & newcomers.#TeamIndia Captain @surya_14kumar ahead of the T20I series against Bangladesh.#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/T7kM6JO02o
— BCCI (@BCCI) October 5, 2024