సౌతాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్ గెలవడమే లక్ష్యంగా టీమిండియా ఆఖరి మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. ఇరుజట్ల మధ్య జొహన్నస్‌బర్గ్ వేదికగా.. శుక్రవారం నాటి టీ20లో గెలిచి.. 3-1తో పర్యటన ముగించాలని పట్టుదలగా ఉంది. ఇక ఈ టూర్‌లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని యువ జట్టు ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో మెరుగ్గానే రాణించింది.
వాళ్లు ఓకే
ముఖ్యంగా తొలి, మూడో టీ20లో బ్యాటర్లు దంచికొట్టిన తీరు అలరించింది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు సంజూ శాంసన్(107- మొదటి టీ20), తిలక్ వర్మ(107 నాటౌట్- మూడో టీ20)లో అద్భుత శతకాలతో సత్తా చాటి విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఇంత వరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.
సూర్యకుమార్ యాదవ్ ఎందుకిలా?
సఫారీలతో మూడు టీ20లలో అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 21, 4, 1. ఈ నేపథ్యంలో కీలకమైన నాలుగో టీ20కి ముందు సూర్య ఫామ్‌పై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సూర్యను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
గత మూడేళ్ల కాలంలో ఇలా
‘‘సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ టీ20ల ఫామ్‌పై ఆందోళన అవసరమే అంటారా?.. చాలా మంది ఈ విషయం గురించి ఆలోచిస్తున్నారు. అందుకే అతడి గణాంకాలను ఓసారి పరిశీలిద్దాం. 2021లో సగటున 34 పరుగులతో 155కు పైగా స్ట్రైక్‌రేటు నమోదు చేశాడు. కేవలం 11 ఇన్నింగ్స్‌లోనే ఇది జరిగింది.
ఇక 2022లో సూర్య యావరేజ్‌గా 46 రన్స్‌తో 187కు పైగా స్ట్రైక్‌రేటుతో 1164 పరుగులు సాధించాడు. అద్భుతంగా ఆడాడు అనడానికి ఇదే నిదర్శనం. ఇక 2023లో 155కు పైగా స్ట్రైక్‌రేటుతో 733 రన్స్ సాధించాడు. సగటు 49. పర్లేదు బాగానే ఆడాడు.
కానీ..2024లో ఇప్పటి వరకు 17 ఇన్నింగ్స్‌లో కేవలం 429 పరుగులే చేయగలిగాడు. స్ట్రైక్‌రేటు 150 ఉన్నా.. సగటు మాత్రం కేవలం 26.8. ఇందులో కేవలం నాలుగు అర్ధ శతకాలే ఉన్నాయి. వీటన్నింటిని బట్టి చూస్తే సూర్య మునుపటి సూర్యలా లేడు. సగటున అతడు రాబడుతున్న పరుగులే ఇందుకు సాక్ష్యం’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
సూర్య కనీసం హాఫ్ సెంచరీ సాధిస్తే..
గత మూడేళ్ల కాలంలో ఈ ఏడాది సూర్యకుమార్ బ్యాటింగ్ మరీ అంతగొప్పగా ఏమీలేదని.. కాబట్టి సూర్య ఫామ్ ఆందోళన కలిగించడంలో ఆశ్చర్యం ఏమీ లేదని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. జొహన్నస్‌బర్గ్ మ్యాచ్‌లో సూర్య కనీసం హాఫ్ సెంచరీ అయినా సాధిస్తే.. జట్టుతో పాటు అతడికీ ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
కాగా డర్బన్‌లో తొలి టీ20లో గెలిచిన టీమిండియా.. గెబెహాలో ఓడిపోయింది. అయితే, సెంచూరియన్‌లో మూడో మ్యాచ్‌లో గెలిచి ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉంది.
చదవండి: పాకిస్తాన్‌తో తొలి టీ20: మాక్స్‌వెల్ ఊచకోత, స్టొయినిస్ విధ్వంసం
Comments
Please login to add a commentAdd a comment