సౌతాఫ్రికా పర్యటనను ఘనంగా ఆరంభించిన టీమిండియా జోరుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ఆతిథ్య ప్రొటిస్ జట్టు బదులు తీర్చుకుంది. రెండో మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచి.. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. కాగా నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు సూర్య సేన సౌతాఫ్రికాకు వెళ్లిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో డర్బన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే, గెబెహాలో ఆదివారం జరిగిన రెండో టీ20లో మాత్రం ఓటమిపాలైంది. కీలక బ్యాటర్లంతా విఫలమైనా.. స్వల్ప లక్ష్యాన్ని కాపాడటం కోసం బౌలర్లు ఆఖరి వరకు పోరాడారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఒకే ఒక్క ఓవర్ ఇస్తారా?
ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా విమర్శలు చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో సూర్య విఫలమయ్యాడని పేర్కొన్నాడు. రెండో టీ20లో అక్షర్‌కు కేవలం ఒకే ఒక్క ఓవర్ ఇవ్వడం భారత కెప్టెన్ చేసిన అతిపెద్ద తప్పని విమర్శించాడు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘అక్షర్ పటేల్ సేవలను పూర్తిగా వినియోగించుకుంటున్నారా? అసలు అతడిని ఎందుకు ఆడిస్తున్నారు? డర్బన్‌లో అక్షర్‌కు కేవలం ఒకే ఒక్క ఓవర్ ఇచ్చారు. గెబెహాలోనూ అదే పరిస్థితి.
సూర్య చేసిన అతిపెద్ద తప్పు ఇది
స్పిన్నర్లు మాత్రమే ఆరు నుంచి ఏడు వికెట్లు తీస్తున్న పిచ్‌పై అక్షర్‌తో ఇలా ఒకే ఒక్క ఓవర్ వేయించడం ఏమిటి? అక్షర్ సేవలను వినియోగించుకోవడంలో మేనేజ్‌మెంట్ విఫలమవుతోంది. తుదిజట్టులో ముగ్గురు స్పిన్నర్లను ఆడిస్తున్నారు. కానీ వారిని సరైన విధంగా ఉపయోగించుకోలేకపోతున్నారు.
భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యం గురించి నేను ప్రస్తుతానికి మాట్లాడదలచుకోలేదు. కానీ బౌలర్‌గా అక్షర్ పటేల్‌ను ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో సూర్య చేసిన అతిపెద్ద తప్పు ఇది అని కచ్చితంగా చెప్పగలను’’ అని పేర్కొన్నాడు.
కేవలం 124 పరుగులు
ఇక ఈ మ్యాచ్‌లో బ్యాట్ ఝులిపించే ప్రయత్నం చేసిన అక్షర్ పటేల్ రనౌట్ కావడం నిజంగా అతడి దురదృష్టమని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికాతో రెండో టీ20లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కేవలం 124 పరుగులు చేసింది.
తిలక్ వర్మ(20), స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(27), హార్దిక్ పాండ్యా(39 నాటౌట్) రాణించడంతో ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు ఆది నుంచే ఇబ్బంది పెట్టారు.
వరుణ్ ఐదు వికెట్లు తీసినా..
ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కేవలం 17 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. మరో స్పిన్నర్ రవి బిష్ణోయి సైతం ఒక వికెట్ తీయగా.. పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా ఒక వికెట్ దక్కించుకున్నాడు.
అయితే, స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై అక్షర్ పటేల్‌కు మాత్రం ఒకే ఒక్క ఓవర్ ఇవ్వగా.. అతడు కేవలం రెండు పరుగులే ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. భారత బౌలర్లు అటాక్ చేస్తున్నా సౌతాఫ్రికా హిట్టర్ ట్రిస్టన్ స్టబ్స్ 41 బంతుల్లో 47 పరగులుతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఇరుజట్ల మధ్య బుధవారం సెంచూరియన్ వేదికగా మూడో టీ20 జరుగనుంది.
చదవండి: హార్దిక్ సెల్ఫిష్ ఇన్నింగ్స్..! ఇదంతా ఐపీఎల్ కోసమేనా: పాక్ మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment