ICC: వరల్డ్‌ నంబర్‌ వన్‌గా హార్దిక్‌ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్‌ వర్మ.. ఏకంగా.. | ICC T20 Rankings: Hardik Pandya Re Claims All Rounders Top Spot Tilak Jumps 69 | Sakshi
Sakshi News home page

ICC: వరల్డ్‌ నంబర్‌ వన్‌గా హార్దిక్‌ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్‌ వర్మ.. ఏకంగా..

Published Wed, Nov 20 2024 3:57 PM | Last Updated on Wed, Nov 20 2024 5:12 PM

ICC T20 Rankings: Hardik Pandya Re Claims All Rounders Top Spot Tilak Jumps 69

ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా సత్తా చాటాడు. టీ20 మెన్స్‌ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో మరోసారి అగ్రస్థానం సంపాదించాడు. ఇటీవల సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఆల్‌రౌండ్‌ ప్రతిభతో ఆకట్టుకున్న హార్దిక్‌.. వరల్డ్‌ నంబర్‌వన్‌గా అవతరించాడు.

ఈ మేరకు ఐసీసీ బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి అగ్రపీఠం కైసవం చేసుకున్నాడు. ఈ క్రమంలో నేపాల్‌కు చెందిన దీపేంద్ర సింగ్‌ ఐరీ, ఇంగ్లండ్‌ విధ్వంసకర వీరుడు లియామ్‌ లివింగ్‌స్టోన్‌ను హార్దిక్‌ పాండ్యా అధిగమించాడు.

తిలక్‌ వర్మ ఏకంగా 69 స్థానాలు ఎగబాకి
మరోవైపు.. టీమిండియా యువ సంచలనం, సెంచరీల వీరుడు తిలక్‌ వర్మ ఏకంగా 69 స్థానాలు ఎగబాకి.. టీ20 మెన్స్‌ బ్యాటర్స్‌ ర్యాంకింగ్స్‌లో మూడో ర్యాంకు సాధించడం విశేషం. అదే విధంగా.. మరో శతకాల వీరుడు సంజూ శాంసన్‌ కూడా 17 స్థానాలు జంప్‌ చేసి.. 22వ ర్యాంకుకు చేరుకున్నాడు.  కాగా ఇటీవల నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాలో పర్యటించిన విషయం తెలిసిందే.

సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలో సఫారీ గడ్డపై 3-1తో ఈ సిరీస్‌ను భారత జట్టు సొంతం చేసుకుంది. ఇందులో 31 ఏళ్ల హార్దిక్‌ పాండ్యా ఇటు బంతితో.. అటు బ్యాట్‌తో రాణించి తన వంతు పాత్ర పోషించాడు.

ముఖ్యంగా నిర్ణయాత్మక నాలుగో టీ20లో మూడు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి.. టీమిండియా గెలుపునకు బాట వేశాడు.

సంజూ శాంసన్‌ సైతం
ఇక రెండో టీ20లోనూ 39 పరుగులతో అతడు అజేయంగా నిలిచాడు. కాగా టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్‌ పాండ్యా ప్రథమ స్థానం సంపాదించడం ఇది రెండోసారి. ఇక తిలక్‌ వర్మ సఫారీలతో సిరీస్‌లో వరుస సెంచరీలతో చెలరేగాడు. 

మూడో టీ20లో 107 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ హైదరాబాదీ బ్యాటర్‌.. నాలుగో మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లోనే 120 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు.. సంజూ శాంసన్‌ సౌతాఫ్రికాలో తొలి టీ20లో 107, నాలుగో టీ20లో 109(నాటౌట్‌) పరుగులు సాధించాడు.

ఐసీసీ టీ20 మెన్స్‌ ఆల్‌రౌండర్ల ర్యాంకులు టాప్‌-5
1. హార్దిక్‌ పాండ్యా(ఇండియా)- 244 రేటింగ్‌ పాయింట్లు
2. దీపేంద్ర సింగ్‌ ఐరీ(నేపాల్‌)- 231 రేటింగ్‌ పాయింట్లు
3. లియామ్‌ లివింగ్‌స్టోన్‌(ఇంగ్లండ్‌)- 230 రేటింగ్‌ పాయింట్లు
4. మార్కస్‌ స్టొయినిస్‌(ఆస్ట్రేలియా)- 209 రేటింగ్‌ పాయింట్లు
5. వనిందు హసరంగ(శ్రీలంక)- 209 రేటింగ్‌ పాయింట్లు

ఐసీసీ టీ20 మెన్స్‌ బ్యాటర్ల జాబితా టాప్‌-5
1. ట్రవిస్‌ హెడ్‌(ఆస్ట్రేలియా)- 855 రేటింగ్‌ పాయింట్లు
2. ఫిల్‌ సాల్ట్‌(ఇంగ్లండ్‌)- 828 రేటింగ్‌ పాయింట్లు
3. తిలక్‌ వర్మ(ఇండియా)- 806 రేటింగ్‌ పాయింట్లు
4. సూర్యకుమార్‌ యాదవ్‌(ఇండియా)- 788 రేటింగ్‌ పాయింట్లు
5. బాబర్‌ ఆజం(పాకిస్తాన్‌)- 742 రేటింగ్‌ పాయింట్లు.

టాప్‌-10లో అర్ష్‌దీప్‌ సింగ్‌
ఇదిలా ఉంటే.. టీ20 బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్‌కు చెందిన ఆదిల్‌ రషీద్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. వనిందు హసరంగ(శ్రీలంక), ఆడం జంపా(ఆస్ట్రేలియా), అకీల్‌ హొసేన్‌(వెస్టిండీస్‌), మహీశ్‌ తీక్షణ(శ్రీలంక) టాప్‌-4లో ఉన్నారు. ఇక టీమిండియా పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని తొమ్మిదో ర్యాంకు పొందాడు.

చదవండి: కోహ్లి పాకిస్తాన్‌లో ఆడాలని అనుకుంటున్నాడు: పాక్‌ దిగ్గజ బౌలర్‌ షాకింగ్‌ కామెంట్స్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement