చాంపియన్స్ ట్రోఫీ-2025.. వచ్చే ఏడాది జరుగనున్న ఈ మెగా టోర్నీ వేదిక విషయమై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఈ ఐసీసీ ఈవెంట్‌కు సంబంధించిన ఆతిథ్య హక్కులను దక్కించుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తమ దేశంలోనే మ్యాచ్‌లన్నింటినీ నిర్వహించాలని పట్టుబడుతోంది. మరోవైపు.. తమ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపేది లేదని.. బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్ మండలికి తేల్చిచెప్పేసింది.
తాము ఆడబోయే మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించేలా హైబ్రిడ్ విధానం కావాలని ఐసీసీని కోరింది. అయితే, పీసీబీ మాత్రం ఇందుకు ఒప్పుకొనే ప్రసక్తే లేదని పంతానికి పోతోంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మాజీ క్రికెటర్లు టోర్నీ నిర్వహణ అంశంపై తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.
కోహ్లికి పాకిస్తాన్‌లో ఆడాలని ఉంది
ఈ క్రమంలో పాక్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ తమ దేశంలో నిర్వహించే అవకాశం లేదని.. ఏదేమైనా చివరిదాకా ఆశావాదంతోనే ఉంటామని పేర్కొన్నాడు. ఇక టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి కూడా పాకిస్తాన్‌కు రావాలని ఉందని.. ఇక్కడ గనుక అతడు సెంచరీ చేస్తే కెరీర్ పరిపూర్ణం అవుతుందంటూ అక్తర్ వ్యాఖ్యానించాడు.
ఐసీసీకి 95- 96 వరకు స్పాన్సర్‌షిప్ ఇండియా నుంచే
‘‘చాంపియన్స్ ట్రోఫీ వేదిక విషయంలో మా ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం వస్తుందని భావిస్తున్నాం. ఐసీసీకి 95- 96 వరకు స్పాన్సర్‌షిప్ ఇండియా నుంచే వస్తుందనేది కాదనలేని వాస్తవం. ఇక ఇప్పుడు ఈ టోర్నీ గురించి ఇరుదేశాల ప్రభుత్వాలదే తుదినిర్ణయం.
బీసీసీఐ గానీ.. పీసీబీ గానీ ఈ అంశంలో నిర్ణయం తీసుకోలేవు. విరాట్ కోహ్లి మొదటిసారి పాకిస్తాన్‌లో ఆడాలని కోరుకుంటున్నాడు. పాకిస్తాన్ కూడా అతడు మా దేశంలో ఆడితే చూడాలని ఉవ్విళ్లూరుతోంది. పాకిస్తాన్ గడ్డ మీద విరాట్ సెంచరీ చేస్తే.. ఆ ఊహే ఎంత బాగుందో కదా! అదే జరిగితే అతడి కెరీర్ పరిపూర్ణం అవుతుంది.
నమ్మకం లేదు
పెద్ద పెద్ద టోర్నీలను పాకిస్తాన్ విజయవంతంగా నిర్వహించలేదనే అపవాదు ఉంది. కనీసం ఈసారైనా అది తప్పని నిరూపించాలని పీసీబీ సిద్ధమవుతోంది. కానీ.. ఈ ఈవెంట్ పూర్తిస్థాయిలో ఇక్కడే జరుగుతుందనే నమ్మకం లేదు. అయితే, చివరి నిమిషం వరకు మేము ఆశలు కోల్పోము. నేనైతే టీమిండియా పాకిస్తాన్‌కు వస్తుందనే ఇప్పటికీ నమ్ముతున్నా’’ అని షోయబ్ అక్తర్ ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
చదవండి: గిల్ స్థానంలో అతడిని ఆడించండి.. ఓపెనర్‌గా కేఎల్ బెస్ట్: భారత మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment