ఇంగ్లండ్‌తో టీ20 సమరానికి(India vs England T20 Series) టీమిండియా సన్నద్ధమైంది. కోల్‌కతాలోని ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం(జనవరి 22) బట్లర్ బృందంతో తొలి టీ20లో తలపడనుంది. ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో 3-1తో ఓటమి తర్వాత భారత జట్టు ఆడుతున్న మొదటి సిరీస్ ఇది.
ఈ నేపథ్యంలో తిరిగి విజయాల బాట పట్టాలని.. ఇంగ్లండ్‌తో టీ20లతో పాటు వన్డేల్లోనూ అదరగొట్టాలని టీమిండియా భావిస్తోంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి ముందు జరిగే ఈ పరిమిత సిరీస్‌లలో విజయాలు సాధించి ఆత్మవిశ్వాసంతో ఐసీసీ టోర్నీలో అడుగుపెట్టాలని పట్టుదలగా ఉంది.
ఓపెనింగ్ జోడీ అదే
కాగా ఇంగ్లండ్‌తో తొలుత ఐదు టీ20లు, అనంతరం మూడు వన్డేల సిరీస్‌లు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి టీ20లో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ జోడీనే ఓపెనర్లుగా కొనసాగనున్నారు. నిజానికి సంజూ ఓపెనింగ్ బ్యాటర్‌గా ప్రమోట్ అయిన తర్వాతే నిలకడగా రాణిస్తున్నాడు.
ఇటీవల సౌతాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్‌లో రెండు శతకాలతో చెలరేగిన ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్.. ఓపెనింగ్ స్థానంలో వచ్చి ఇప్పటి వరకు 366 పరుగులు సాధించాడు. అతడి స్ట్రైక్‌రేటు 198.91 కావడం గమనార్హం. ఇక అంతర్జాతీయ టీ20లలో సంజూ ఇప్పటికే మూడు సెంచరీలు తన పేరిట లిఖించుకున్నాడు.
మరోవైపు.. అభిషేక్ శర్మ మాత్రం ఐపీఎల్ మాదిరి టీమిండియా తరఫున బ్యాట్ ఝులిపించలేకపోతున్నాడు. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ తర్వాత అతడి సగటు కేవలం 18.85 కావడం గమనార్హం. అయితే, దేశీ టీ20 టోర్నీలో మాత్రం మంచి ఫామ్ కనబరిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో పంజాబ్ కెప్టెన్‌గా వ్యవహరించిన అభిషేక్.. 255 పరుగులు చేశాడు.
వరుసగా మూడు శతకాలు
ఇక మూడో స్థానంలో హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ దిగడం ఖాయమే. సౌతాఫ్రికాతో టీ20లలో వరుస శతకాలు బాదిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ సెంచరీతో చెలరేగాడు. తద్వారా పొట్టి ఫార్మాట్లో ఓవరాల్‌గా వరుసగా మూడు శతకాలు సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.
మరోవైపు.. మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రాగా.. ఈసారి కూడా టీమిండియా ఇద్దరు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాతో పాటు నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
ఆస్ట్రేలియా గడ్డపై శతకం(టెస్టు) బాదిన నితీశ్ రెడ్డి.. తనకు గుర్తింపు తెచ్చిన టీ20 ఫార్మాట్లో ఇంగ్లండ్‌పై ఏ మేరకు రాణిస్తాడో చూడాలి! వీరితో పాటు ఫినిషర్ రింకూ జట్టులో ఉండనే ఉంటాడు.
షమీ రాక.. రాణాకు నో ఛాన్స్
ఇక బౌలర్ల విషయంలో.. ముఖ్యంగా పేసర్ల విషయంలో కాస్త సందిగ్దం నెలకొనే అవకాశం ఉంది. దాదాపు పద్నాలుగు నెలల తర్వాత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఈ సిరీస్‌తో పునరాగమనం చేస్తున్నాడు. కాబట్టి అతడు పూర్తి ఫిట్‌గా ఉంటే యాక్షన్‌లోకి దిగడం లాంఛనమే. అయితే, అతడితో పాటు పేస్ దళంలో అర్ష్‌దీప్ సింగ్ ఒక్కడికే ఛాన్స్ దక్కనుంది.
చాంపియన్స్ ట్రోఫీకి ముందు అర్ష్ కూడా వీలైనంత ఎక్కువ క్రికెట్ ఆడతాడు. దీంతో హర్షిత్ రాణా బెంచ్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఇక స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌తో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తుదిజట్టులో ఆడనుండగా.. వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయిని మేనేజ్‌మెంట్ పక్కనపెట్టనున్నట్లు సమాచారం. ఇక వికెట్ కీపర్‌గా సంజూ అందుబాటులో ఉంటాడు కాబట్టి ధ్రువ్ జురెల్ కూడా బెంచ్‌కే పరిమితమవ్వాల్సిన పరిస్థితి.
ఇంగ్లండ్‌తో తొలి టీ20కి భారత తుదిజట్టు(అంచనా)
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
బెంచ్: వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయి.
చదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్‌లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే
Comments
Please login to add a commentAdd a comment