తలకు గాయం.. అప్‌డేట్‌ ఇచ్చిన తిలక్‌ వర్మ! ఆ విషయంలో క్రెడిట్‌ వాళ్లకే | Ind vs SA 3rd T20: Tilak Varma Gives Update On His Head Injury | Sakshi
Sakshi News home page

తలకు గాయం.. అప్‌డేట్‌ ఇచ్చిన తిలక్‌ వర్మ! ఆ విషయంలో క్రెడిట్‌ వాళ్లకే

Published Thu, Nov 14 2024 4:21 PM | Last Updated on Thu, Nov 14 2024 5:21 PM

Ind vs SA 3rd T20: Tilak Varma Gives Update On His Head Injury

తిలక్‌ వర్మకు గాయం(PC: X)

సౌతాఫ్రికాతో మూడో టీ20లో గెలుపు కోసం టీమిండియా ఆఖరి వరకు పోరాడాల్సి వచ్చింది. భారీ స్కోరు సాధించినా.. చివరి ఓవర్‌ వరకు ఆతిథ్య జట్టు గట్టిపోటీనిచ్చింది. దీంతో భారత బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో టీమిండియా సెంచరీ హీరో తిలక్‌ వర్మ గాయపడ్డాడు.

ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో భారత పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ ఆఖరి ఓవర్‌ వేశాడు. అప్పటికే జోరు మీదున్న ప్రొటిస్‌ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ మార్కో జాన్సెన్‌.. అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో రెండో బంతికి కవర్స్‌ మీదుగా భారీ సిక్సర్‌ బాదాడు. అయితే, ఆ బంతిని అందుకునే క్రమంలో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న తిలక్‌ వర్మ.. క్యాచ్‌ అందుకునే క్రమంలో కిందపడ్డాడు.

తిలక్‌ తల నేలకు బలంగా తాకినట్లు
ఫలితంగా క్యాచ్‌ మిస్‌ కావడమే గాక.. తిలక్‌ తల నేలకు బలంగా తాకినట్లు రీప్లేలో కనిపించింది. దీంతో భారత శిబిరంలో కలకలం రేగింది. వెంటనే ఫిజియో వచ్చి తిలక్‌ను పరిస్థితిని పర్యవేక్షించాడు. మరోవైపు... ఈ సిక్సర్‌తో జాన్సెన్‌ యాభై పరుగుల మార్కును పూర్తి చేసుకుని.. టీమిండియాపై ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ(16 బంతుల్లో) నమోదు చేసిన తొలి సౌతాఫ్రికా ప్లేయర్‌గా నిలిచాడు.

ఇదిలా ఉంటే.. తిలక్‌ వర్మ గాయంపై అభిమానుల్లోనూ ఆందోళన నెలకొంది. అతడు తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందేహాల నడుమ.. పోస్ట్‌ మ్యాచ్‌ ప్రజెంటేషన్‌లో తిలక్‌ వర్మ తన గాయంపై అప్‌డేట్‌ అందించాడు.

నేను బాగానే ఉన్నాను
‘‘నేను బాగానే ఉన్నాను. క్యాచ్‌ అందుకునేటపుడు వెలుతురు కళ్లలో పడి.. బంతిని పట్టుకోవడం సాధ్యం కాలేదు. ఏదేమైనా మేము గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తిలక్‌ వర్మ పేర్కొన్నాడు. అదే విధంగా.. తాను విధ్వంసకర శతకం బాదడంలో క్రెడిట్‌ మొత్తం కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌తో పాటు కోచ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌కు ఇవ్వాలని తిలక్‌ అన్నాడు.

107 పరుగులు
ఈ మ్యాచ్‌లో మూడో నంబర్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం ఇచ్చినందుకు సూర్యకు ధన్యవాదాలు తెలిపాడు. కాగా సెంచూరియన్‌ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో తిలక్‌ వర్మ 56 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో ఏకంగా 107 పరుగులు సాధించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి భారత్‌ 219 పరుగులు స్కోరు చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. 

ఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 208 పరుగుల వద్ద నిలిచి.. పదకొండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో తిలక్‌.. అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో హెన్రిచ్‌ క్లాసెన్‌(41)క్యాచ్‌ అందుకుని మ్యాచ్‌ను మలుపు తిప్పడంలో దోహదపడ్డాడు.

చదవండి: Mohammed Shami: రీ ఎంట్రీలో చెలరేగిన మహ్మద్‌ షమీ..

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement