అంతర్జాతీయ టీ20లలో టీమిండియా తరఫున 2022లో అరంగేట్రం చేశాడు అర్ష్‌దీప్ సింగ్. రెండేళ్లకాలంలోనే పొట్టి ఫార్మాట్‌లో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా అవతరించాడు. తాజాగా సౌతాఫ్రికా పర్యటనలోనూ సత్తా చాటుతున్నాడు ఈ యువ పేసర్.
నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టీ20లలో స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్‌పై కూడా అర్ష్‌దీప్ ఫర్వాలేదనిపించాడు. ఆ రెండు మ్యాచ్‌లలో ఒక్కో వికెట్ తీసిన ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్.. మూడో టీ20లో మాత్రం తన సత్తా చూపించాడు. కీలక సమయంలో మూడు కీలక వికెట్లు కూల్చి టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు.
కీలక సమయంలో కీలక వికెట్లు తీసి
పవర్ ప్లేలో సౌతాఫ్రికా ఓపెనర్ రియాన్ రెకెల్టన్(15 బంతుల్లో 20)ను పెవిలియన్‌కు పంపిన అర్ష్‌దీప్.. విధ్వంసకర బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్(22 బంతుల్లో 41)ను అవుట్ చేసి తన ఖాతాలో రెండో వికెట్ జమచేసుకున్నాడు. ఇక ప్రొటిస్ జట్టు లక్ష్యానికి చేరువగా వస్తుందనుకున్న సమయంలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ వీరుడు మార్కో జాన్సెన్(17 బంతుల్లో 54)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని గట్టిషాకిచ్చాడు.
అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్‌బౌలర్‌గా
మొత్తంగా మూడో టీ20లో నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన అర్ష్‌దీప్ 37 పరుగులు ఇచ్చి.. మూడు వికెట్లు కూల్చాడు. తద్వారా అంతర్జాతీయ టీ20లలో 92 వికెట్ల మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్‌కుమార్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్‌బౌలర్‌గా అవతరించాడు.
అంతేకాదు.. టీమిండియా తరఫున టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గానూ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో భారత వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ 96 వికెట్లతో మొదటిస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, తొంభై వికెట్ల క్లబ్‌లో చేరేందుకు చహల్‌కు 80 మ్యాచ్‌లు అవసరమైతే.. 25 ఏళ్ల అర్ష్‌దీప్ సింగ్ కేవలం 59 మ్యాచ్‌లలోనే ఈ ఘనత సాధించడం విశేషం.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లు
1. యజువేంద్ర చహల్- 80 మ్యాచ్‌లలో 96 వికెట్లు
2. అర్ష్‌దీప్ సింగ్- 59 మ్యాచ్‌లలో 92 వికెట్లు
3. భువనేశ్వర్ కుమార్- 87 మ్యాచ్‌లలో 90 వికెట్లు
4. జస్‌ప్రీత్ బుమ్రా- 70 మ్యాచ్‌లలో 89 వికెట్లు.
తిలక్, అభిషేక్ ధనాధన్
ఇదిలా ఉంటే.. సెంచూరియన్ వేదికగా బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. తిలక్ వర్మ(107 నాటౌట్), అభిషేక్ శర్మ(50) అద్భుత ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఏకంగా 219 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో ఆఖరి వరకు సౌతాఫ్రికా పోరాడినా.. భారత బౌలర్ల విజృంభణతో వారికి ఓటమి తప్పలేదు. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 208 పరుగుల వద్ద నిలిచిన ప్రొటిస్ జట్టు.. టీమిండియా చేతిలో పదకొండు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో సూర్యకుమార్ సేన ఈ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక నాలుగో టీ20 జొహన్నస్‌బర్గ్‌లో ఆదివారం జరుగనుంది.
చదవండి: అతడి కోసం నా ప్లేస్‌ను త్యాగం చేశా.. చెప్పి మరీ సెంచరీ బాదాడు: సూర్య
Comments
Please login to add a commentAdd a comment