టీమిండియాతో మూడో టీ20లో సౌతాఫ్రికా అంత తేలికగా తలవంచలేదు. సూర్యకుమార్ సేన విధించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆఖరి వరకు పోరాడగలిగింది. ఇందుకు ప్రధాన కారణం ప్రొటిస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్.
కేవలం 16 బంతుల్లోనే
స్పెషలిస్టు బ్యాటర్లంతా దాదాపుగా చేతులెత్తేసిన వేళ.. జాన్సెన్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ పరుగుల వరద పారించాడు. ఒకానొక దశలో టీమిండియా నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంటాడా అనేంతలా అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. కేవలం 16 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
తొలి సౌతాఫ్రికా ప్లేయర్‌గా
ఈ క్రమంలో సౌతాఫ్రికా తరఫున అత్యంత వేగంగా అంతర్జాతీయ హాఫ్ సెంచరీ సాధించిన రెండో బ్యాటర్‌గా మార్కో జాన్సెన్ రికార్డు సాధించాడు. అంతేకాదు.. టీమిండియాపై టీ20లలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన తొలి సౌతాఫ్రికా ప్లేయర్‌గానూ చరిత్ర సృష్టించాడు.
ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 17 బంతులు ఎదుర్కొన్న జాన్సెన్ నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 317కు పైగా స్ట్రైక్‌రేటుతో 54 పరుగులు సాధించాడు. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ గనుక జాన్సెన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోకుంటే పెద్ద ప్రమాదమే జరిగేది. ఎట్టకేలకు జాన్సెన్ అవుట్ కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగుల వద్ద నిలిచిన సౌతాఫ్రికా టీమిండియా చేతిలో ఓటమిపాలైంది.
ఇదిలా ఉంటే.. మూడో టీ20లో జాన్సెన్ ఒక వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ రూపంలో కీలక వికెట్ తీసి సత్తా చాటాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ(107) సెంచరీతో చెలరేగగా.. మార్కో జాన్సెన్ సైతం తన ప్రతిభను చాటుకున్నాడు.
రూ. 10 కోట్ల ప్లేయర్ కాదంటారా?
ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ మార్కో జాన్సెన్‌ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘‘మార్కో జాన్సెన్.. రూ. 10 కోట్ల ప్లేయర్ కాదంటారా? నేనైతే అవుననే అంటాను’’ అని స్టెయిన్ పేర్కొన్నాడు. ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో జాన్సెన్ గురించి ఫ్రాంఛైజీలకు గుర్తు చేస్తూ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
కాగా ఐపీఎల్-2024లో మార్కో జాన్సెన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, ఈ సీజన్‌లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకే ఒక్క వికెట్ తీశాడు. ఈ నేపథ్యంలో వేలానికి ముందు సన్‌రైజర్స్ అతడిని విడిచిపెట్టింది.
సౌతాఫ్రికా వర్సెస్ టీమిండియా స్కోర్లు
వేదిక: సూపర్‌స్పోర్ట్ పార్క్, సెంచూరియన్
టాస్: సౌతాఫ్రికా.. తొలుత బౌలింగ్
టీమిండియా స్కోరు- 219/6 (20)
సౌతాఫ్రికా స్కోరు- 208/7 (20)
ఫలితం: పదకొండు పరుగుల తేడాతో టీమిండియా విజయం.. 2-1తో భారత్ పైచేయి
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: తిలక్ వర్మ(56 బంతుల్లోనే 107 నాటౌట్).
చదవండి: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా ఘనత
Comments
Please login to add a commentAdd a comment