రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్...కర్ణాటక విజయానికి మరో 87 పరుగులు కావాలి... విదర్భ తొలిసారి ఫైనల్ చేరేందుకు మరో 3 వికెట్లు తీయాలి...కర్ణాటక లోయర్ ఆర్డర్ పోరాడుతోంది...మరో వికెట్ కోల్పోయినా 78 పరుగులు వచ్చేశాయి... ఇక చేతిలో 2 వికెట్లతో చేయాల్సింది 9 పరుగులే...ఈ దశలో మ్యాచ్‌లో ఉత్కంఠ మరింత పెరిగిపోయింది... కావాల్సినంత సమయం కర్ణాటకకు ఉండగా, విదర్భ దాదాపు మ్యాచ్ చేజార్చుకున్నట్లే అనిపించింది... అయితే ఒత్తిడిలో చిత్తయిన కర్ణాటక బ్యాట్స్‌మన్ మిథున్ కొట్టిన తప్పుడు షాట్ విదర్భకు దారి చూపించింది. మరో 3 పరుగులకే చివరి వికెట్ కూడా తీసి ఆ జట్టు చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. రజనీశ్ గుర్బాని అద్భుత బౌలింగ్‌తో ముందుండి నడిపించగా తొలిసారి రంజీ ఫైనల్లోకి అడుగు పెట్టింది.
కోల్‌కతా: తొలి రోజు నుంచి ఆధిక్యం చేతులు మారి విజయం దోబూచులాడుతూ వచ్చిన మ్యాచ్‌లో చివరకు గెలుపు విదర్భను వరించింది. గురువారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్‌లో ముగిసిన రంజీ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్లో విదర్భ 5 పరుగుల తేడాతో కర్ణాటకను ఓడించింది. 198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 111/7తో ఆట కొనసాగించిన కర్ణాటక తమ రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు ఆలౌటైంది. వినయ్ కుమార్ (36), అభిమన్యు మిథున్ (33), శ్రేయస్ గోపాల్ (23 నాటౌట్) పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. విదర్భ పేసర్ రజనీశ్ గుర్బాని (7/68) చివరి రోజు కూడా చెలరేగి ఆఖరి మూడు వికెట్లు పడగొట్టడం విశేషం. గురువారం కర్ణాటక ఇన్నింగ్స్ 16.1 ఓవర్లు సాగింది. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 12 వికెట్లు గుర్బానికే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ నెల 29నుంచి ఇండోర్‌లో జరిగే ఫైనల్లో ఢిల్లీతో విదర్భ తలపడుతుంది.
మలుపులు, మెరుపులు...
రంజీ ట్రోఫీ చరిత్రలో గొప్ప మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచిపోయే ఈ సెమీస్‌లో ఆఖరి రోజు 75 నిమిషాల పాటు సాగిన ఆటలో అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. చక్కటి పోరాటపటిమతో మ్యాచ్‌ను ఇక్కడి దాకా తీసుకొచ్చిన విదర్భ చివర్లో కాస్త తడబాటుకు లోనైంది. ఫలితంగా కర్ణాటక బ్యాట్స్‌మెన్ చకచకా పరుగులు సాధించారు. వరుసగా చెత్త బంతులు వేయడంతో వేగంగా పరుగులు వచ్చాయి. అయితే గుర్బాని ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన వినయ్ కుమార్ అదే ఓవర్ చివరి బంతికి కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో విదర్భ జట్టులో ఆశలు చిగురించాయి. ఆ తర్వాత వచ్చిన మిథున్ బౌండరీలతో ఎదురుదాడి చేశాడు. నిజానికి 1 పరుగు వద్ద సింగిల్ తీసే ప్రయత్నంలో సగం పిచ్ దాటిన మిథున్, గోపాల్ తిరస్కరించడంతో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అయితే కీపర్ వాడ్కర్ బంతిని సరిగా అందుకోకపోవడంతో మిథున్ బతికిపోయాడు. అతను ఉమేశ్, సర్వతే ఓవర్లలో వరుసగా రెండేసి బౌండరీలు బాదాడు. ఈ జోరులో కర్ణాటక గెలుపు ఖాయంలా అనిపించింది. కానీ అత్యుత్సాహం ప్రదర్శించిన మిథున్...గుర్బానీ బౌలింగ్‌లో దూరంగా వెళుతున్న బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. గాల్లో లేచిన బంతిని డీప్ పాయింట్‌లో సర్వతే అందుకోవడంతో కర్ణాటక తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మరో పొరపాటు కర్ణాటక ఆట ముగించింది. అప్పటికే నిలదొక్కుకున్న, కెరీర్‌లో నాలుగు సెంచరీలు సాధించిన రికార్డు ఉన్న శ్రేయస్ గోపాల్ ఒక ఎండ్‌లో ఉండగా... బలహీన బ్యాట్స్‌మన్ అరవింద్ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీయడంతో అతనే మళ్లీ స్ట్రైక్‌కు రావాల్సి రావడం ఆ జట్టు రాతను మార్చింది. తర్వాతి ఓవర్ తొలి బంతికే అరవింద్‌ను అవుట్ చేసిన గుర్బాని ఉద్వేగంగా కంటతడి పెట్టాడు. విదర్భ సంబరాల్లో మునిగిపోగా...కర్ణాటక తమను తాము నిందించుకోవాల్సి వచ్చింది.
చివరకు వేదన...
రంజీ నాకౌట్‌లో ఇలాంటి ఫలితాలు గతంలోనూ వచ్చాయి. 1990–91 ఫైనల్లో హర్యానా చేతిలో 2 పరుగులతో ముంబై ఓడగా...1992–93 ప్రిక్వార్టర్ ఫైనల్లో కర్ణాటక 5 పరుగులతో మధ్యప్రదేశ్ చేతిలో పరాజయంపాలైంది. 2009–10 ఫైనల్లో కర్ణాటక 6 పరుగులతో ముంబై చేతిలో ఓడింది. బరోడా, సదరన్ పంజాబ్ మధ్య 1945–46 సెమీస్ ‘టై’గా ము గియగా, టాస్‌తో బరోడాను విజేతగా తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment