సాక్షి, విశాఖపట్నం: మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ పట్టుదలతో పోరాడటంతో... పంజాబ్‌తో జరుగుతోన్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు పుంజుకుంది. రికీ భుయ్ (291 బంతుల్లో 151 బ్యాటింగ్; 13 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీకి తోడు... కేఎస్ భరత్ (175 బంతుల్లో 76; 6 ఫోర్లు, 1 సిక్స్), సుమంత్ (124 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా బాధ్యతాయుతంగా ఆడటంతో శనివారం ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. రోజంతా బౌలింగ్ చేసిన పంజాబ్ కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టింది.
ఓవర్‌నైట్ స్కోరు 54/3తో మూడో రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర జట్టును కేఎస్ భరత్‌తో కలిసి భుయ్ ఆదుకున్నాడు. ఈ జోడీ కుదురుకునే వరకు జాగ్రత్తగా ఆడి ఆ తర్వాత ఎదురుదాడి చేసింది. ఈ క్రమంలో నాలుగో వికెట్‌కు 151 పరుగులు జోడించాక మయాంక్ మార్కండే (3/96) బౌలింగ్‌లో భరత్ ఔటయ్యాడు. ఆ తర్వాత సుమంత్‌తో కలిసి భుయ్ ఐదో వికెట్‌కు 132 పరుగులు జోడించాడు. ప్రస్తుతం అతని పాటు కరణ్ శర్మ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. పంజాబ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు (414)కు ఆంధ్ర ఇంకా 86 పరుగుల దూరంలో ఉంది. మ్యాచ్‌కు ఆదివారం చివరి రోజు.
హైదరాబాద్ 30/1
కేరళ, హైదరాబాద్ జట్ల మధ్య తిరువనంతపురంలో జరుగుతోన్న మరో మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో మూడో రోజు 20 ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి. ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది. అక్షత్ రెడ్డి (3) త్వరగా ఔటయ్యాడు. తన్మయ్ (24 బ్యాటింగ్; 4 ఫోర్లు), రోహిత్ రాయుడు (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment