‘మెంటర్’గా మాస్టర్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన అనంతరం సచిన్ టెండూల్కర్ మరోసారి ఆటతో నేరుగా మమేకం కానున్నాడు. ప్రముఖ క్రీడా ఉత్పత్తుల సంస్థ ‘అడిడాస్’ రూపొందించిన కార్యక్రమంలో భాగంగా అతను కొత్త తరం యువ ఆటగాళ్లకు మెంటర్‌గా వ్యవహరించనున్నాడు. ఇందు కోసం దేశవ్యాప్తంగా 11 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఈ జాబితాలో జమ్మూ కాశ్మీర్ ఆల్‌రౌండర్ పర్వేజ్ రసూల్, భారత అండర్-19 మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ ఉన్నారు.
వీరు కాకుండా ఇప్పటికే భారత జట్టులో కీలక ఆటగాళ్లు అయిన కోహ్లి, రోహిత్ శర్మ, రైనాలతో కూడా అడిడాస్ గతంలోనే ఒప్పందం కుదుర్చుకుంది. ‘ఇదో కొత్త తరహా ఆలోచన. యువ ఆటగాళ్లు తమ లక్ష్యాలను చేరుకునేందుకు ఇది ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ క్రికెటర్లకు మెంటర్‌గా వ్యవహరించడం అంటే నాకెంతో ఇష్టమైన క్రికెట్‌కు చేరువగా ఉండటంతో పాటు...నా వైపునుంచి ఆటకు సేవ చేయడం కూడా’ అని సచిన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు.
ఈ కార్యక్రమం కోసం ‘అడిడాస్’ సంస్థ... ఉన్ముక్త్, రసూల్, విజయ్ జోల్, మనన్ వోహ్రా, మన్‌ప్రీత్ జునేజా, రుష్ కలారియా, చిరాగ్ ఖురానా, ఆకాశ్‌దీప్ నాథ్, వికాస్ మిశ్రా, సర్ఫరాజ్ ఖాన్, బాబా అపరాజిత్‌లను ఎంపిక చేసింది.