
కాంగ్రెస్‌కు ‘మాస్టర్’ ప్రచారం చేయడు: రాజీవ్ శుక్లా
కాన్పూర్: భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో ప్రచారం చేయడని ఆ పార్టీ ఎంపీ, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున దిగ్గజ బ్యాట్స్‌మన్ ప్రచారం చేయనున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు. ‘సచిన్ ఇప్పుడు క్రికెట్ మ్యాచ్‌లతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ముంబై తరఫున రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. అనంతరం స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో పాల్గొంటాడు.
ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో అతను పాలుపంచుకుంటాడనే వార్తలు పూర్తిగా నిరాధారం’ అని శుక్లా చెప్పారు. యూపీఏ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం గతేడాది సచిన్‌ను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతిఫలంగా అతను కాంగ్రెస్‌కు ప్రచారం చేస్తాడనే వార్తలొచ్చాయి. అయితే వీటిని ఆ పార్టీ సినీయర్ ఎంపీ అయిన శుక్లా నిర్ద్వందంగా కొట్టిపారేశారు. ప్రస్తుతం మాస్టర్ బ్యాట్స్‌మన్ వీడ్కోలు సిరీస్ కోసం సన్నాహకంగా రంజీ మ్యాచ్ ఆడుతున్నట్లు చెప్పారు. ఇక భవిష్యత్‌లో అతని ప్రచారం గురించి ఇప్పుడే చెప్పడం సముచితం కాదన్నారు.