ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తాను సాధించిన కాంస్య పతకం గాలివాటంగా వచ్చినది కాదని తెలుగు తేజం, భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి ఆటగాడు భమిడిపాటి సాయిప్రణీత్ నిరూపించాడు. తనదైన రోజున ఎంతటి మేటి క్రీడాకారులనైనా బోల్తా కొట్టిస్తానని ఈ హైదరాబాద్ ప్లేయర్ మరోసారి రుజువు చేశాడు. మంగళవారం ఆరంభమైన డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్‌లో సాయిప్రణీత్ తొలి రౌండ్‌లో పెను సంచలనం సృష్టించాడు. రెండు సార్లు ఒలింపిక్ చాంపియన్‌గా, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన చైనా దిగ్గజం లిన్ డాన్‌ను వరుస గేముల్లో ఓడించి సాయిప్రణీత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
ఒడెన్స్ (డెన్మార్క్): ఈ ఏడాది లోటుగా ఉన్న వరల్డ్ టూర్ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో... డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ చాంపియన్ పీవీ సింధు... ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్ సాయిప్రణీత్ 36 నిమిషాల్లో 21–14, 21–17తోప్రపంచ 18వ ర్యాంకర్, మాజీ నంబర్‌వన్, 36 ఏళ్ల లిన్ డాన్ (చైనా)పై... మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఐదో సీడ్ సింధు 38 నిమిషాల్లో 22–20, 21–18తో ప్రపంచ జూనియర్ మాజీ చాంపియన్ గ్రెగోరియా మరిస్కా టున్‌జుంగ్ (ఇండోనేసియా)పై విజయం సాధించారు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా)తో సింధు ఆడనుండగా... ప్రపంచ చాంపియన్, వరల్డ్ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్), వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్) మధ్య జరిగే తొలి రౌండ్ మ్యాచ్ విజేతతో సాయిప్రణీత్ తలపడతాడు.
గతంలో లిన్ డాన్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన సాయిప్రణీత్ ఈసారి మాత్రం అదరగొట్టాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ, నిలకడగా పాయింట్లు సాధించాడు. మొదట్లో 3–0తో ఆధిక్యం సంపాదించిన సాయిప్రణీత్ ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కొనసాగించి తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో ఇద్దరూ ప్రతీ పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. 16–16తో స్కోరు సమంగా ఉన్నదశలో సాయిప్రణీత్ రెండు పాయింట్లు సాధించి 18–16తో ముందంజ వేశాడు. ఆ తర్వాత లిన్ డాన్ ఒక పాయింట్ నెగ్గగా... ఆ వెంటనే సాయిప్రణీత్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి చైనా స్టార్ ప్లేయర్ ఓటమిని ఖాయం చేశాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన భారత ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, సౌరభ్ వర్మ పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. ప్రపంచ 25వ ర్యాంకర్ కశ్యప్ 13–21, 12–21తో సితికోమ్ తమాసిన్ (థాయ్‌లాండ్) చేతిలో... సౌరభ్ వర్మ 21–19, 11–21, 17–21తో మార్క్ కాల్జూ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయారు.
పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 24–22, 21–11తో కిమ్ జి జంగ్–లీ యోంగ్ డే (దక్షిణ కొరియా) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 23–25, 18–21తో టాప్ సీడ్ మాయు మత్సుమోతో–వకానా నాగాహార (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో కిడాంబి శ్రీకాంత్; కాంటా సునెయామ (జపాన్)తో సమీర్ వర్మ; మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సయాక తకహాషి (జపాన్)తో సైనా నెహా్వల్ తలపడతారు. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మార్విన్ సిడెల్–లిండా ఎఫ్లెర్ (జర్మనీ)లతో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా; వాంగ్ యి లియు–హువాంగ్ డాంగ్ పింగ్ (చైనా)లతో సాతి్వక్ సాయిరాజ్–అశి్వని పొన్నప్ప పోటీపడతారు.
►1 ప్రపంచ మాజీ చాంపియన్స్ లేదా ఒలింపిక్ మెడలిస్ట్‌లైన ఆరుగురు ఆటగాళ్లను (తౌఫిక్ హిదాయత్–ఇండోనేసియా; లీ చోంగ్ వీ–మలేసియా; చెన్ లాంగ్–చైనా; విక్టర్ అక్సెల్‌సన్–డెన్మార్క్; కెంటో మొమోటా–జపాన్; లిన్ డాన్–చైనా) కనీసం ఒక్కసారైనా ఓడించిన ఏకైక భారత క్రీడాకారుడు సాయిప్రణీత్.
►4 చైనా దిగ్గజం లిన్ డాన్‌ను కనీసం ఒక్కసారి ఓడించిన నాలుగో భారత ప్లేయర్ సాయిప్రణీత్. గతంలో హెచ్‌ఎస్ ప్రణయ్ మూడుసార్లు లిన్ డాన్‌పై నెగ్గగా... పుల్లెల గోపీచంద్ రెండుసార్లు (2002లో) ఓడించగా...
శ్రీకాంత్ (2014లో) ఒక్కసారి గెలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment