హుస్సేన్‌సాగర్‌ను శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొన్న అజహర్
హైదరాబాద్: జాతీయ స్థాయి సెయిలింగ్ చాంపియన్‌షిప్‌కు ఆతిథ్యమిచ్చేందుకు హుస్సేన్ సాగర్ సన్నద్ధమైంది. ప్రతి ఏడాది ‘హైదరాబాద్ సెయిలింగ్ వీక్’ పేరిట జరుగనున్న ఈ టోర్నీని తొలిసారి ర్యాంకింగ్ ఈవెంట్‌గా నిర్వహిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 200 మంది సెయిలర్లు ఇందులో తలపడతారని ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్ వైస్ కమాండర్, మేజర్ జనరల్ నారాయణ తెలిపారు. టోర్నీలో ప్రదర్శన ఆధారంగా సెయిలర్లకు ర్యాంకులు కేటాయిస్తామని చెప్పారు. ఈ ర్యాంకులు జాతీయ జట్టుకు ఎంపికయ్యేందుకు అర్హతగా ఉపయోగపడతాయని వివరించారు. ఈ పోటీల్లో సీనియర్ మల్టీక్లాస్ ర్యాంకింగ్ రెగెట్టాతో పాటు, లేజర్ ర్యాంకింగ్ చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తారు.
సాగర్‌లో పరిశుభ్రత కార్యక్రమం...
హైదరాబాద్ సెయిలింగ్ వీక్ జరుగనున్న నేపథ్యంలో ‘మిలిట్రీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్’ (ఎంసీఈఎంఈ) విద్యార్థులు ‘గ్రీన్ బ్రిగేడ్ వాక్’, ‘సేవ్ లేక్ క్యాంపెయిన్’, ‘ఫిట్ హైదరాబాద్ స్వచ్ఛ్ హైదరాబాద్’ అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. సుమారు 6000 మంది విద్యార్థులు మానవహారంగా ఏర్పడి సరస్సులను కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ పాల్గొన్నారు. ఆయన హుస్సేన్‌సాగర్‌ను పరిశుభ్రంగా ఉంచాలని పేర్కొంటూ చెత్తా చెదారాన్ని తొలగించారు. వ్యాయామం ఆవశ్యకతను తెలియజేస్తూ విద్యార్థులు నిర్వహించిన 3.5 కి.మీ నడకలో పాల్గొన్నారు. ‘స్వచ్ఛ్ హైదరాబాద్’ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈఎంఈ సెయిలింగ్ సంఘం గౌరవ కార్యదర్శి మేజర్ అలోక్‌కుమార్, లెప్టినెంట్ జనరల్ పరంజిత్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.
హుస్సేన్‌సాగర్‌ను శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొన్న అజహర్
Comments
Please login to add a commentAdd a comment