సైనా సందేహమే!
ఇప్పటికీ తేల్చని స్టార్ షట్లర్
15నుంచి ఆసియా టీమ్ బ్యాడ్మింటన్
సాక్షి, హైదరాబాద్: ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో భారత్‌కు మెరుగైన అవకాశాలు ఉన్నాయని జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయ పడ్డారు. శ్రీకాంత్‌తో పాటు అజయ్ జైరాం, హెచ్‌ఎస్ ప్రణయ్ ఇటీవల నిలకడగా రాణిస్తుండటం, సొంతగడ్డపై ఆడుతుండటం జట్టుకు కలిసొస్తుందని ఆయన అన్నారు. అయితే మహిళల విభాగంలో సింగిల్స్‌తో పాటు రెండో డబుల్స్ జోడీపై కూడా ఇంకా స్పష్టత లేదని ఆయన చెప్పారు. ముఖ్యంగా భారత నంబర్‌వన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఈ టోర్నీలో పాల్గొనటంపై ఇంకా స్పష్టత రాలేదని ఆయన వెల్లడించారు. ‘భారత జట్టు జాబితాలో సైనా పేరు ఉంది. అయితే ప్రస్తుతానికి ఆమెనుంచి ఎలాంటి సమాచారం లేదు. ఆడతానని గానీ ఆడనని గానీ సైనా చెప్పలేదు.
దీని ప్రభావం జట్టుపై ఎలా ఉంటుందనేది ఇప్పుడే అంచనాకు రాలేం. మహిళల రెండో డబుల్స్ మ్యాచ్‌లో సిక్కిరెడ్డి, మనీషా జోడి గురించి ఆలోచన ఉంది కానీ వారికున్న అనుభవం తక్కువ. సైనా ఉంటే సైనా-సింధు కలిసి కూడా డబుల్స్ ఆడవచ్చు’ అని గోపీచంద్ స్పష్టం చేశారు. ఇటీవల టీమ్ ఈవెంట్లలో మన జట్టు బాగా ఆడుతున్న విషయాన్ని గుర్తు చేసిన కోచ్... యువ షట్లర్లు తమను తాము నిరూపించుకునేందుకు ఇది మంచి అవకాశమన్నారు. ఈ నెల 15నుంచి 21 వరకు గచ్చిబౌలి స్టేడియంలో ఆసియా చాంపియన్‌షిప్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. 2009లో ప్రపంచ చాంపియన్‌షిప్ తర్వాత హైదరాబాద్‌లో మరో పెద్ద స్థాయి టోర్నీ జరగడం ఇదే తొలిసారి. మరో వైపు గాయం కారణంగా పారుపల్లి కశ్యప్ టోర్నీకి దూరమయ్యాడు.