శ్రమించి గెలిచారు | Saina, Kashyap and Srikanth good opening in china opening | Sakshi
Sakshi News home page

శ్రమించి గెలిచారు

Published Thu, Nov 13 2014 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

శ్రమించి గెలిచారు

శ్రమించి గెలిచారు

రెండో రౌండ్‌లో సైనా, కశ్యప్, శ్రీకాంత్  చైనా ఓపెన్
 
 ఫుజౌ (చైనా): గట్టి ప్రత్యర్థులు ఎదురైనా... పట్టుదలతో పోరాడిన సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్ చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల తొలి రౌండ్‌లో ఆరో సీడ్ సైనా 21-14, 19-21, 21-17తో సయాక తకహాషి (జపాన్)పై గెలిచింది. తకహాషిపై సైనాకిది వరుసగా మూడో విజయం కావడం విశేషం.

పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో శ్రీకాంత్ 21-11, 9-21, 21-15తో హైదరాబాద్‌కే చెందిన తన సహచరుడు గురుసాయిదత్‌పై గెలుపొందగా... కశ్యప్ 24-22, 19-21, 21-15తో నాన్ వీ (హాంకాంగ్)ను ఓడించాడు.

మరో మ్యాచ్‌లో కేరళ ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్ 10-21, 21-19, 18-21తో విక్టర్ అక్జెల్సన్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం 12-21, 15-21తో జియోలాంగ్ లియు-జిహాన్ కియు (చైనా) జంట చేతిలో పరాజయం పాలైంది. తకహాషితో 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సైనా తొలి గేమ్‌లో స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది.

రెండో గేమ్‌లో మాత్రం ఈ హైదరాబాద్ అమ్మాయి తడబడి ఒకదశలో వరుసగా ఎనిమిది పాయింట్లను కోల్పోయింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా ఒకదశలో 11-12తో వెనుకబడినప్పటికీ వెంటనే కోలుకుంది. వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 16-11తో ఆధిక్యంలోకి వెళ్లి అదే జోరులో గేమ్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement