సైనా ఇంటికి... | Saina Nehwal crashes out of Rio Olympics | Sakshi
Sakshi News home page

సైనా ఇంటికి...

Published Mon, Aug 15 2016 2:13 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

సైనా ఇంటికి...

సైనా ఇంటికి...

సింధు, శ్రీకాంత్ ముందుకు
  అంచనాలు తారుమారయ్యాయి. కచ్చితంగా పతకం గెలుస్తుందని భావించిన భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. గత ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన హైదరాబాదీ... ఈ సారి రిక్తహస్తాలతో ఇంటిముఖం పట్టింది. అయితే సింధు, శ్రీకాంత్ ప్రి క్వార్టర్స్‌కు చేరి భారత ఆశలను సజీవంగా నిలిపారు.
 
 అంచనాలు తారుమారయ్యాయి. కచ్చితంగా పతకం గెలుస్తుందని భావించిన భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. గత ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన హైదరాబాదీ... ఈ సారి రిక్తహస్తాలతో ఇంటిముఖం పట్టింది. అయితే సింధు, శ్రీకాంత్  ప్రి క్వార్టర్స్‌కు చేరి భారత ఆశలను సజీవంగా నిలిపారు.
 
 రియో డి జనీరో: గాయాన్ని దాచి రియో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు భంగపాటు ఎదురైంది. నాకౌట్ దశ (ప్రిక్వార్టర్ ఫైనల్)కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో సైనా అనూహ్య పరాజయాన్ని చవిచూసింది. ప్రపంచ 61వ ర్యాంకర్ మరియా ఉలిటినా (ఉక్రెయిన్)తో జరిగిన గ్రూప్ ‘జి’ లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ 5వ ర్యాంకర్ సైనా 18-21, 19-21తో ఓడిపోయింది. ముగ్గురు క్రీడాకారిణిలున్న గ్రూప్ ‘జి’లో టాపర్ మాత్రమే నాకౌట్ దశకు చేరుకుంటుంది. ఫలితంగా రెండు విజయాలు సాధించిన ఉలిటినా ముందంజ వేయగా... విసెంటి లొహెని (బ్రెజిల్)పై నెగ్గిన సైనా ఒక విజయం, ఒక ఓటమితో రెండో స్థానంలో నిలిచి నిష్ర్కమించింది.
 
 ఉలిటినాతో 39 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సైనా మ్యాచ్ మొత్తం అసౌకర్యంగా కదిలింది. పలుమార్లు ఆధిక్యంలోకి వెళ్లినా అనవసర తప్పిదాలు చేస్తూ ఉలిటినాకు పుంజుకునే అవకాశాన్ని కల్పించింది. రెండో గేమ్‌లోనూ ఆధిక్యం అటుఇటు అయినా కీలకదశలో సైనా తప్పిదాలు చేసి ఓటమిని ఖాయం చేసుకుంది.
 
 పోరాడి నెగ్గిన సింధు
 మరోవైపు గ్రూప్ ‘ఎమ్’లో పీవీ సింధు వరుసగా రెండో విజయాన్ని సాధించి నాకౌట్ దశకు అర్హత పొందింది. ప్రపంచ 20వ ర్యాంకర్, చైనా సంతతికి చెందిన కెనడా ప్లేయర్ మిచెల్లి లీతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 19-21, 21-15, 21-17తో గెలిచింది. తొలి గేమ్‌ను కోల్పోయిన సింధు... నెమ్మదిగా తేరుకొని సంయమనంతో ఆడుతూ వరుసగా రెండు గేమ్‌లను సొంతం చేసుకొని గట్టెక్కింది.

 పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ శ్రీకాంత్ గ్రూప్ ‘హెచ్’ రెండో లీగ్ మ్యాచ్‌లో 21-6, 21-18తో హెన్రీ హుర్స్‌కెనైన్ (స్వీడన్)పై గెలుపొంది ముందంజ వేశాడు. ప్రిక్వార్టర్స్‌లో తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు... జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)తో శ్రీకాంత్ తలపడే అవకాశాలున్నాయి.  పురుషుల డబుల్స్ నామమాత్రపు చివరి లీగ్ మ్యాచ్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం 23-21, 21-11తో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ జోడీ కెనిచి హయకావ-హిరోయుకి ఎండో (జపాన్)పై గెలిచింది.

 మారథాన్‌లో జైషా : 89... కవిత :120...
 అథ్లెటిక్స్ మహిళల మారథాన్ రేసులో బరిలోకి దిగిన జైషా, కవిత తుంగర్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. 42.195 కిలోమీటర్ల దూరాన్ని జైషా 2 గంటల 47 నిమిషాల 19 సెకన్లలో పూర్తి చేసి 89వ స్థానంలో... కవిత 2 గంటల 59 నిమిషాల 29 సెకన్లలో పూర్తి చేసి 120వ స్థానంలో నిలిచారు. మొత్తం 157 మంది పాల్గొన్న ఈ రేసులో 24 మంది రేసును పూర్తి చేయకుండానే మధ్యలో వైదొలిగారు.
 
 ‘రియో ఒలింపిక్స్‌కు పది రోజుల ముందు ప్రాక్టీస్ సందర్భంగా మోకాలికి గాయమైంది. ఈ మ్యాచ్‌లోనూ నొప్పితోనే బరిలోకి దిగాను. నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించలేకపోయాను. చురుకుగా కదల్లేకపోయాను. ఈ ఓటమి నా మనసును ఎంతగానో కలిచివేసింది. అందరికంటే ఎక్కువగా నేను బాధ పడుతున్నాను.’                                                  

-సైనా నెహ్వాల్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement