హైదరాబాద్: టీమిండియా సారథి విరాట్ కోహ్లి చేసిన ఓ ట్వీట్ ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ఊహాగానాలకు తావిచ్చింది. రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించడానికి గురువారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేశాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో చాలాకాలం తర్వాత మరోసారి ఎంఎస్ ధోని రిటైర్మెంట్ హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే బీసీసీఐతో చర్చించాడని గురువారం ప్రెస్ మీట్‌లో రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించనున్నాడని అనేక వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై ధోని సతీమణి సాక్షి ధోని స్పందించారు. ధోని రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలు అసత్యమని కొట్టిపారేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
ఇక చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా ధోని రిటైర్మెంట్ వార్తలను కొట్టిపారేశాడు. తనకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని, ధోని ఈ విషయంపై బీసీసీఐతో గాని నాతో గాని చర్చించలేదని స్పష్టం చేశాడు. ఇక ధోని రిటైర్మెంట్, ప్రెస్ మీట్‌పై తమకు అధికారిక సమాచారం లేదని బీసీసీఐ పేర్కొంది. ప్రపంచకప్ అనంతరం ధోని విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. భారత్ ఆర్మీకి సేవలందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక తాజాగా ఆర్మీ శిక్షణ పూర్తి చేసుకున్న ధోని కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నాడు. విశ్రాంతి నేపథ్యంలో దక్షిణాఫ్రికా సిరీస్‌కు కూడా ధోని అందుబాటులో ఉండటం లేదు. అయితే ధోనిని విశ్రాంతి పేరుతో కావాలనే పక్కకు పెడుతున్నారని క్రికెట్ అభిమానులు విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment