
డారెన్ స్యామీ ఆవేదన
సెయింట్ జాన్స్(ఆంటిగ్వా): వెస్టిండీస్కు రెండు టీ 20 వరల్డ్ కప్లు అందించిన ఏకైక కెప్టెన్ డారెన్ స్యామీ. అయితే స్యామీని టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ వెస్టిండీస్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తన ఫేస్బుక్ అకౌంట్లో అభిమానులకు తెలియజేసిన స్వామీ ఆవేదన వ్యక్తం చేశాడు. కేవలం సెలక్టర్లు తనతో 30 సెకెండ్లపాటు మాత్రమే మాట్లాడి కెప్టెన్సీ తొలిగిస్తున్నట్లు చెప్పడం తీవ్ర వేదనకు గురిచేసిందన్నాడు.
'శుక్రవారం సెలక్టర్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ సారాంశ ఏంటంటే నన్ను కెప్టెన్సీ తప్పిస్తున్నట్లు విండీస్ సెలక్షన్ కమిటీ చైర్మన్ తెలిపారు. ఆ విషయాన్ని కూడా 30 సెకెండ్లలోముగించి కాల్ కట్ చేశారు. మా బోర్డు ఇలా చేయడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. టీ 20 కెప్టెన్సీ నియమాకానికి కొత్త వ్యక్తి అన్వేషణలో ఉన్నట్లు మా సెలక్షన్ చైర్మన్ పేర్కొన్నారు. విండీస్ సెలక్టర్లను నా ఆట ఆకట్టుకోలేదట. ఈ కారణం చేతనే కెప్టెన్సీ నుంచి తొలిగిస్తున్నట్లు చెప్పారు. ఇక విండీస్ కు టీ 20 కెప్టెన్ గా ఎంపిక కాలేనేమో' అని స్యామీ ఆందోళన వ్యక్తం చేశాడు.