'నన్ను స్యామీ అభినందించాడు'
పోర్ట్ ఆఫ్ స్పెయిన్:వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీతో తనకు ఎటువంటి విభేదాలు లేవని ఇటీవల టీ 20 కెప్టెన్గా ఎంపికైన కార్లోస్ బ్రాత్ వైట్ స్పష్టం చేశాడు. ప్రస్తుత వెస్టిండీస్ జట్టులో చెప్పుకోదగ్గ విభేదాలు కూడా ఏమీ లేవన్నాడు. విండీస్ టీ 20 జట్టుకు కెప్టెన్ గా ఎంపికైన అనంతరం తనను మొదటి అభినందించింది స్యామీయేనని బ్రాత్ వైట్ పేర్కొన్నాడు. 'నేను కెప్టెన్గా ఎంపికయ్యాక స్యామీతో మాట్లాడా. అతని నుంచి నాకు అభినందనలతో పాటు దీవెనలు కూడా లభించాయి. అదే కాకుండా త్వరలో భారత జట్టుతో ఆడబోయే టీ 20 సిరీస్ ఒక ఛాలెంజ్గా తీసుకోవాలని స్యామీ అన్నాడు. ఒక సీనియర్గా ఆటగాడిగా స్యామీ తగిన సూచనలు చేశాడు. స్యామీ ఇలా చెప్పడం నా కెప్టెన్సీ సమర్ధవంతంగా చేయడానికి ఉపయోగపడుతుంది'అని బ్రాత్ వైట్ అన్నాడు.
కొన్నినెలల క్రితం భారత్లో జరిగిన టీ 20 వరల్డ్ కప్ను విండీస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ జట్టుకు స్యామీ కెప్టెన్ కాగా, బ్రాత్ వైట్ అప్పుడు జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కాగా, విండీస్తో బోర్డుకు ఆటగాళ్లకు మధ్య చోటు చేసుకున్న విభేదాల కారణంగా కొంతమంది సీనియర్లు జట్టుకు దూరమయ్యారు. దాంతో పాటు స్యామీని టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పించి బ్రాత్ వైట్కు అప్పగించారు.