ఆ వైఫల్యానికి పూర్తి బాధ్యత నాదే!
కొలంబో:టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్ లో శ్రీలంక ఘోర వైఫల్యానికి తానే పూర్తిగా బాధ్యత వహిస్తానని ఆ దేశ క్రికెట్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ సనత్ జయసూర్య స్పష్టం చేశాడు. టీమిండియాపై 5-0 తేడాతో శ్రీలంక ఓడిన అనంతరం బోర్డు తరపున తొలిసారి మీడియాకు ముందుకొచ్చిన జయసూర్య ఆ ఓటమి భారాన్ని తనపై వేసుకుంటానన్నాడు. 2015 లో జరిగే వరల్డ్ కప్ కు శ్రీలంక క్రికెట్ ను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని. అందుకోసం ఇప్పటికే సెలెక్షన్ ప్యానెల్ యత్నాలు ఆరంభించదన్నాడు.
ప్రస్తుతం డిప్యూటీ స్పోర్ట్స్ మినిష్టర్ గా ఉన్న జయసూర్య.. శ్రీలంక ఘోర ఓటమికి క్రీడా మంత్రిని గానీ మిగతా వారిని నిందించాల్సిన అవసరం లేదన్నాడు. శ్రీలంక జట్టు ఘోర ఓటమికి మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. బీసీసీఐని మెప్పించడం కోసం శ్రీలంక క్రికెట్ జట్టును నిరాశ నిస్పృహల్లో మునిగేలా చేశారని వ్యాఖ్యానించారు.