
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ల ఫిట్‌నెస్‌లో భాగంగా నిర్వహిస్తున్న యో యో టెస్టుపై మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ మండిపడ్డాడు. స్వల్ప వ్యవధిలో యో యో టెస్టు నిర్వహించి ఒక క్రికెటర్‌గా ఫిట్‌గా లేడని జట్టు నుంచి తప్పించడం ఎంతమాత్రం సరికాదన్నాడు. యో యో విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అవలంభిస్తున్న ప్రస్తుత విధానం ఎంతమాత్రం బాలేదన్నాడు. యో యో టెస్టులో ఒకసారి విఫలమైన ఆటగాడికి మరొకసారి అవకాశం ఇచ్చే యోచనను బీసీసీఐ పరిశీలించాలన్నాడు.
‘టెస్టు మ్యాచ్‌లో ఎలాగైతే ఆటగాళ్లకు రెండు ఇన్నింగ్స్‌ల ద్వారా తామేంటో నిరూపించుకోవడానికి అవకాశం దక్కుతుందో... అలాగే బీసీసీఐ అధికారులు కూడా యో యో టెస్టు ఫెయిలైన వారికి మరో అవకాశం ఇవ్వాలి. ఒకవేళ ఆటగాడు యో యో టెస్టు విఫలమైతే మరుసటి రోజు అతడికి మరొకసారి టెస్టు నిర్వహించాలి. ఏడాది పాటు దేశవాళీ క్రికెట్‌లో అంబటి రాయుడు అద్భుతంగా రాణించాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు. అలాంటి ఆటగాడు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడం, లేకపోవడంపై కేవలం అరగంటలోనే ఎలా నిర్ణయం తీసేసుకుంటారు. ఆటగాళ్లను జట్టు నుంచి ఇలా తప్పించడం సరికాదు. ఇది వారి కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది’ అని పాటిల్ పేర్కొన్నాడు. కొన్ని రోజుల క్రితం అంబటి రాయుడు, మహమ్మద్ షమి, సంజు శాంసన్‌లు యో యో టెస్టులో విఫలమై జట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment