హైదరాబాద్‌ను ఆదుకున్న సందీప్, హసన్
ముంబై: ఓపెనర్ అక్షత్ రెడ్డి (64; 9 ఫోర్లు), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ అనిరుధ్ (49; 7 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీ భాగస్వామ్యం అందించడం... ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ తడబడటం... చివర్లో లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ బాధ్యతాయుతంగా ఆడటంతో... సర్వీసెస్‌తో ఆదివారం మొదలైన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్ గౌరవప్రద స్కోరును సాధించడంలో సఫలమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 89 ఓవర్లలో 7 వికెట్లకు 303 పరుగులు సాధించింది. వికెట్ నష్టానికి 136 పరుగులతో పటిష్టంగా కనిపించిన హైదరాబాద్... ఒక్కసారిగా 7 పరుగుల తేడాలో 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
కెప్టెన్ బద్రీనాథ్ (0) ఖాతా తెరువకుండానే రనౌట్ కాగా... వికెట్ కీపర్ కొల్లా సుమంత్ (0) కూడా డకౌట్ అయ్యాడు. ఆకాశ్ భండారి (4) నిరాశపరిచాడు. దాంతో 6 వికెట్లకు 141 పరుగులతో డీలాపడిన హైదరాబాద్‌ను బావనాక సందీప్ (129 బంతుల్లో 83 బ్యాటింగ్; 11 ఫోర్లు), లెఫ్టార్మ్ స్పిన్నర్ మెహదీ హసన్ (83 బంతుల్లో 61; 11 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరూ బాధ్యతాయుతంగా ఆడి ఏడో వికెట్‌కు 135 పరుగులు జతచేశారు. హసన్ అవుటయ్యాక సీవీ మిలింద్ (14 బ్యాటింగ్; 3 ఫోర్లు)తో కలిసి సందీప్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. సర్వీసెస్ బౌలర్లలో రౌషన్ రాజ్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు.