
వేలంలో హైదరాబాద్, ఆంధ్ర జట్ల నుంచి ఒక్క ఆటగాడికే అవకాశం దక్కింది. హైదరాబాద్ రంజీ జట్టు వైస్ కెప్టెన్, ఆల్‌రౌండర్ బావనక సందీప్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అతని కనీస విలువ రూ. 20 లక్షలకు తీసుకుంది. గతంలో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించిన ఆంధ్ర క్రికెటర్లు హనుమ విహారి, కోన శ్రీకర్ భరత్, యెర్రా పృథీ్వరాజ్‌లపై ఈసారి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. ఎడంచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన సందీప్ 38 టి20ల్లో 126.77 స్ట్రైక్‌రేట్‌తో 734 పరుగులు చేశాడు. వేలంలో కాకుండా ఇప్పటికే హైదరాబాద్ నుంచి మొహమ్మద్ సిరాజ్ బెంగళూరు తరఫున... అంబటి రాయుడు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నారు. సిరాజ్‌ను బెంగళూరు రూ. 2 కోట్ల 60 లక్షలకు... రాయుడిని చెన్నై రూ. 2 కోట్ల 20 లక్షలకు అట్టి పెట్టుకున్నాయి.