లండన్: వచ్చే నెలలో పాకిస్తాన్‌లో పర్యటించనున్న కుమార సంగక్కర నేతృత్వంలోని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) జట్టును ప్రకటించారు. ఈ మేరకు 12 మందితో కూడిన ఇంగ్లిష్ కౌంటీ క్లబ్ జట్టును ఎంసీసీ తాజాగా వెల్లడించింది. ఈ జట్టులో సంగక్కర సారథిగా వ్యవహరిస్తుండగా, మరో సీనియర్ క్రికెటర్ రవి బొపారాను సైతం ఎంపిక చేశారు. పాక్ పర్యటనలో ఎంసీసీ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో రెండు మ్యాచ్‌లను పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) జట్లైన లాహోర్ క్వాలండర్స్-ముల్తాన్ సుల్తాన్స్‌తో ఎంసీసీ ఆడనుంది. ఇక మూడో మ్యాచ్‌ను పాకిస్తాన్ దేశవాళీ టీ20 మ్యాచ్ విజేత నార్తరన్‌తో ఎంసీసీ జట్టు తలపడుతోంది.
తమ దేశంలో క్రికెట్‌ను బతికించాలంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చేసిన విజ్ఞప్తిని ఎంసీసీ గత నెల్లో ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎంసీసీ నుంచి ఒక జట్టును పాకిస్తాన్ పర్యటనకు పంపడానికి సమాయత్తమైంది. ఎంసీసీ అధ్యక్షుడిగా ఉన్న సంగక్కర సారథ్యంలోని జట్టు.. పాకిస్తాన్ పర్యటనకు పంపాలని నిర్ణయించింది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్ తరహా దేశాల్లో క్రికెట్‌ను బ్రతికించడం చాలా ముఖ్యమని భావించిన ఎంసీసీ.. పాక్‌లో పరిస్థితులు బాగానే ఉన్నాయనే చెప్పాలనే ఉద్దేశంతోనే తమ జట్టును అక్కడకు పంపుతుంది.
2009లో పాకిస్తాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఆ ప్రమాదంలో పలువురు క్రికెటర్లు గాయాలు బారిన పడ్డా ప్రాణ నష్టం జరగలేదు. ఆ ఘటనలో కుమార సంగక్కర సైతం గాయపడ్డాడు. అప్పట్నుంచి పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడానికి విదేశీ జట్లు భయపడుతున్నాయి. భద్రతాపరంగా అన్ని హామీలు లభించిన తర్వాత అందుకు సమాయత్తమవుతున్నాయి. ఆ దాడి తర్వాత పాకిస్తాన్ పర్యటనకు వరల్డ్ ఎలెవన్ జట్టు ఒకసారి వెళ్లగా, శ్రీలంక అక్కడకు తరుచూ వెళుతూనే ఉంది. ఇటీవల శ్రీలంక జట్టు.. పాకిస్తాన్‌లో టెస్టు సిరీస్ ఆడింది. ఆ దాడి తర్వాత పాక్‌లో ఇదే తొలి టెస్టు సిరీస్ కాగా, ప్రస్తుతం బంగ్లాదేశ్ సైతం పాకిస్తాన్ పర్యటనలో ఉంది. దీనిలో భాగంగా ఇప్పటికే మూడు టీ20ల సిరీస్ ఆడిన బంగ్లాదేశ్.. పాక్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు సిద్ధమైంది.
పాక్‌కు వెళ్లే ఎంసీసీ జట్టు ఇదే..
కుమార సంగక్కర(కెప్టెన్), రవి బొపారా, మైకేల్ బర్జెస్, ఒలివర్ హానన్, ఫ్రెడ్ క్లాసెన్, మైకేల్ లీస్క్, అర్రోన్ లిల్లీ, ఇమ్రాన్ క్వాయమ్, విల్ రోడ్స్, సఫ్‌యాన్ షఫ్రీ, వాన్ డెర్ మెర్వీ, రాస్ వైట్లీ
Comments
Please login to add a commentAdd a comment