కుమార సంగక్కరా(ఫైల్‌ఫొటో)
లండన్: తమ దేశంలో క్రికెట్‌ను బతికించాలంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చేసిన విజ్ఞప్తిని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) మన్నించింది. ఈ మేరకు ఎంసీసీ నుంచి ఒక జట్టును పాకిస్తాన్ పర్యటనకు పంపడానికి సమాయత్తమైంది. దానిలో భాగంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో లాహోర్‌కు జట్టును పంపడానికి అంగీకరించింది. అయితే పాకిస్తాన్ పర్యటనకు వచ్చే ఎంసీసీ జట్టు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరా నేతృత్వం వహించనున్నాడు. ఈ విషయాన్ని ఎంసీసీ తాజాగా ధృవీకరించింది. ఎంసీసీ అధ్యక్షుడిగా ఉన్న సంగక్కరా సారథ్యంలోని జట్టు.. పాకిస్తాన్ పర్యటనకు వస్తుందని స్పష్టం చేసింది. ‘ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్ తరహా దేశాల్లో క్రికెట్‌ను బ్రతికించడం చాలా ముఖ్యం. పాకిస్తాన్‌లో క్రికెట్‌ను కాపాడుకోవడానికి పీసీబీ ఇప్పటికే పలు మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించింది. అందుకు మేము కూడా సిద్ధం ఉన్నాం’ అని ఎంసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
2009లో పాకిస్తాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఆ ప్రమాదంలో పలువురు క్రికెటర్లు గాయాలు బారిన పడ్డా ప్రాణ నష్టం జరగలేదు. ఆ ఘటనలో కుమార సంగక్కరా సైతం గాయపడ్డాడు. అప్పట్నుంచి పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడానికి విదేశీ జట్లు భయపడుతున్నాయి. భద్రతాపరంగా అన్ని హామీలు లభించిన తర్వాత అందుకు సమాయత్తమవుతున్నాయి. ఆ దాడి తర్వాత పాకిస్తాన్ పర్యటనకు వరల్డ్ ఎలెవన్ జట్టు ఒకసారి వెళ్లగా, శ్రీలంక అక్కడకు తరుచూ వెళుతూనే ఉంది. ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ జట్టు పాకిస్తాన్ పర్యటనలోనే ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటికే తొలి టెస్టు జరగ్గా అది డ్రాగా ముగిసింది. అయితే రెండో టెస్టు గురువారం నుంచి కరాచీలో ఆరంభం కానుంది. ఆ దాడి తర్వాత పాకిస్తాన్‌లో ఒక ద్వైపాక్షిక టెస్టు సిరీస్ జరగడం ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment