'భారత్కు కాంస్య పతకాన్ని సాధిస్తాం'
రియో డి జనీరో: భారత టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ లో మిశ్రమ ఫలితం వచ్చింది. సానియా మిర్జా, రోహన్ బోపన్న జోడీ ఆదివారం తెల్లవారుజామున జరిగిన తొలి సెమీస్ పోరులో వీనస్ విలియమ్స్-రాజీవ్ రామ్ (అమెరికా) ద్వయం చేతిలో 2-6, 6-2, 10-3 (టై బ్రేక్) తేడాతో ఓటమి చెందింది. తొలి సెట్ ను సునాయాసంగా సొంతం చేసుకున్న సానియా-బోపన్న జోడీ రెండో రౌండ్ నుంచి తడబాటుకు గురైంది. దీంతో ఒలింపిక్స్ స్వర్ణాలు నెగ్గిన అనుభవమున్న వీనస్ తన జోడీతో కలిసి చెలరేగిపోయింది.
బోపన్న మీడియాతో మాట్లాడుతూ.. తొలి సెట్ కోల్పోయినా వీనస్ జోడీ అద్భుతంగా పుంజుకుని మ్యాచ్ నెగ్గింది. ఈ క్రెడిట్ అంతా వీనస్ కే చెందుతుందన్నాడు. ముఖ్యంగా వీనస్ సర్వీస్ తమను ఇబ్బంది పెట్టిందని బోపన్న పేర్కొన్నాడు. ఓటమి నుంచి త్వరగా కోలుకుని కాంస్య పతకం నెగ్గడమే తమ ముందున్న లక్ష్యమని తెలిపాడు.
ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత సానియా మాట్లాడుతూ.. ఈ ఓటమి నుంచి కోలుకుని బరిలో దిగడం చాలెంజింగ్ గా ఉంటుందని పేర్కొంది. అయితే సాధ్యమైనంత త్వరగా మానసికంగా, శారీరకంగానూ కోలుకుని మరుసటి మ్యాచ్కు సిద్థంగా ఉంటామని చెప్పింది. మ్యాచ్ ముగిసిన తర్వాత మొదట స్కోరు చేసిన విషయాలు గుర్తించి, ఎక్కడెక్కడ పాయింట్లు కోల్పోయాయో వాటిని సరిదిద్దుకోవాలని అభిప్రాయపడింది.