సూపర్ సానియా | Sania Mirza, Martina Hingis clinch WTA finals title | Sakshi
Sakshi News home page

సూపర్ సానియా

Published Mon, Nov 2 2015 12:11 AM | Last Updated on Sun, Sep 3 2017 11:50 AM

సూపర్ సానియా

సూపర్ సానియా

ఆద్యంతం అద్వితీయ ప్రదర్శనతో ఈ ఏడాది అంచనాలకు మించి రాణించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సీజన్‌ను గొప్ప విజయంతో ముగించింది. స్విట్జర్లాండ్ దిగ్గజం మార్టినా హింగిస్‌తో కలిసి ఈ హైదరాబాద్ స్టార్ మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ చాంపియన్‌షిప్‌లో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. తద్వారా సీజన్ ముగింపు టోర్నమెంట్‌ను వరుసగా రెండోసారి నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్‌గా సానియా కొత్త చరిత్ర సృష్టించింది.
 
* రెండోసారి డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ టైటిల్ సొంతం
* ఈసారి హింగిస్‌తో కలిసి ఘనత
* ఒక్క సెట్ కోల్పోకుండా జైత్రయాత్ర
* సీజన్‌లో ఇండో-స్విస్ జోడీకిది తొమ్మిదో టైటిల్
సింగపూర్: ఎలాంటి సంచలనం జరగలేదు. ఊహించిన ఫలితమే వచ్చింది. టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు రాణించిన సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ చాంపియన్‌షిప్‌లో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ జంట సానియా-హింగిస్ 6-0, 6-3తో ముగురుజా-కార్లా సురెజ్ నవారో (స్పెయిన్) జోడీని చిత్తుగా ఓడించింది.
     
* కేవలం 66 నిమిషాల్లో ముగిసిన ఈ ఫైనల్లో సానియా జంట పూర్తి ఆధిపత్యం చలాయించింది. నాలుగు ఏస్‌లు సంధించిన ఈ ఇండో-స్విస్ జోడీ రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొలి సెట్‌లో ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. రెండో సెట్‌లో కాస్త పోటీ ఎదుర్కొన్న సానియా-హింగిస్ జంట తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది.
* ఈ టోర్నమెంట్‌లో సానియా-హింగిస్ ద్వయం ఒక్క సెట్ కూడా కోల్పోకుండా విజేతగా నిలువడం విశేషం. మొత్తం 61 గేమ్‌లు నెగ్గిన ఈ జోడీ ప్రత్యర్థులకు కేవలం 31 గేమ్‌లను సమర్పించుకుంది. గత 22 మ్యాచ్‌ల నుంచి సానియా జంటకు ఓటమి లేకపోవడం విశేషం.
* గ్రాండ్‌స్లామ్‌ల తర్వాత ప్రతిష్టాత్మక టోర్నీగా భావించే డబ్ల్యూటీఏ చాంపియన్‌షిప్‌లో డబుల్స్ టైటిల్ నెగ్గడం సానియాకిది రెండోసారి. గతేడాది కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి సానియా ఈ టైటిల్‌ను సాధించగా... ఈసారి హింగిస్‌తో టైటిల్‌ను నిలబెట్టుకుంది. విజేతగా నిలిచిన సానియా-హింగిస్ జంటకు 5 లక్షల డాలర్లు (రూ. 3 కోట్ల 27 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.  
* ఓవరాల్‌గా సానియా కెరీర్‌లో ఇది 32వ డబుల్స్ టైటిల్ కాగా.. ఈ ఏడాది 10వ టైటిల్. హింగిస్‌తో కలిసి తొమ్మిదోది. సానియా-హింగిస్ జంట ఈ ఏడాది ఇండియన్ వెల్స్ ఓపెన్, మియామి ఓపెన్, చార్ల్స్‌టన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్, గ్వాంగ్‌జూ ఓపెన్, వుహాన్ ఓపెన్, బీజింగ్ ఓపెన్, డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీల్లో టైటిల్స్ సాధించింది. సిడ్నీ ఓపెన్‌లో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి సానియా విజేతగా నిలిచింది.
* మరోవైపు మార్టినా హింగిస్ కెరీర్‌లో ఇది 50వ డబుల్స్ టైటిల్. తద్వారా ఈ ఘనత సాధించిన 16వ క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. ఈ జాబితాలో మార్టినా నవ్రతిలోవా, రోసీ కాసల్స్, పామ్     ష్రైవర్, బిల్లీ జీన్ కింగ్, జ్వెరెవా, లీసా రేమండ్, యానా నొ వోత్నా, అరంటా శాంచెజ్, గీగీ ఫెర్నాండెజ్, సుకోవా, లారిసా, కారా బ్లాక్, రెనీ స్టబ్స్, వెండీ టర్న్‌బాల్, లీజెల్ హుబెర్ ఉన్నారు.
 
1 సిడ్నీ ఓపెన్
భాగస్వామి: బెథానీ మాటెక్ (అమెరికా)
ఫైనల్ ప్రత్యర్థి: రాకెల్ కాప్స్-అబిగేల్ స్పియర్స్  (అమెరికా);
ఫైనల్ స్కోరు: 6-3, 6-3
 
2 ఇండియన్ వెల్స్ ఓపెన్
భాగస్వామి: మార్టినా హింగిస్
ఫైనల్ ప్రత్యర్థి: మకరోవా-వెస్నినా (రష్యా)
ఫైనల్ స్కోరు: 6-3, 6-4
 
3 మియామి ఓపెన్
భాగస్వామి: మార్టినా హింగిస్
ఫైనల్ ప్రత్యర్థి: మకరోవా-వెస్నినా (రష్యా)
ఫైనల్ స్కోరు: 7-5, 6-1
 
4 చార్ల్స్‌టన్ ఓపెన్
భాగస్వామి: మార్టినా హింగిస్
ఫైనల్ ప్రత్యర్థి: డెలాక్వా (ఆస్ట్రేలియా)-జురాక్ (క్రొయేషియా);
ఫైనల్ స్కోరు: 6-0, 6-4
 
5 వింబుల్డన్
భాగస్వామి: మార్టినా హింగిస్
ఫైనల్ ప్రత్యర్థి: మకరోవా-వెస్నినా (రష్యా)
ఫైనల్ స్కోరు: 5-7, 7-6 (7/4), 7-5
 
6 యూఎస్ ఓపెన్
భాగస్వామి: మార్టినా హింగిస్
ఫైనల్ ప్రత్యర్థి: కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా)-ష్వె దోవా (కజకిస్తాన్);
ఫైనల్ స్కోరు: 6-3, 6-3
 
7 గ్వాంగ్‌జూ ఓపెన్
భాగస్వామి: మార్టినా హింగిస్
ఫైనల్ ప్రత్యర్థి: షిలిన్ జు-జియోడి యు (చైనా)
ఫైనల్ స్కోరు: 6-3, 6-1
 
8 వుహాన్ ఓపెన్
భాగస్వామి: మార్టినా హింగిస్
ఫైనల్ ప్రత్యర్థి: ఇరీనా-మోనికా నికెలెస్కూ (రుమేనియా);
ఫైనల్ స్కోరు: 6-2, 6-3
 
9 బీజింగ్ ఓపెన్
భాగస్వామి: మార్టినా హింగిస్
ఫైనల్ ప్రత్యర్థి: హావో-యుంగ్ జాన్ (తైపీ)
ఫైనల్ స్కోరు: 6-7 (9/11), 6-1, 10-8
 
10 డబ్ల్యూటీఏ ఫైనల్స్
భాగస్వామి: మార్టినా హింగిస్
ఫైనల్ ప్రత్యర్థి: ముగురుజా- కార్లా నవారో (స్పెయిన్);
ఫైనల్ స్కోరు: 6-0, 6-3
 
ఏడేళ్ల తర్వాత...
ఈ ఏడాది మార్చిలో మార్టినా హింగిస్‌తో కలిసి సానియా మీర్జా తొలిసారి బరిలోకి దిగింది. జంటగా ఆడిన తొలి టోర్నమెంట్ (ఇండియన్ వెల్స్)లోనే వీరికి టైటిల్ దక్కింది. ఆ తర్వాత వరుసగా మరో రెండు టోర్నీల్లో (మియామి, చార్ల్స్‌టన్) ఈ ద్వయం విజేతగా నిలిచి ‘హ్యాట్రిక్’ సాధించింది. ఈ క్రమంలో సానియా మీర్జా ఏప్రిల్‌లో డబుల్స్‌లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆరు టోర్నీల్లో సానియా-హింగిస్ ఆడినా వారికి టైటిల్ దక్కలేదు. వింబుల్డన్ టోర్నీలో టైటిల్ సాధించి ఈ జంట మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. టొరంటో, సిన్సినాటి టోర్నీల్లో వీరు విఫలమైనా... వెంటనే తేరుకొని ఆ తర్వాత వరుసగా నాలుగు టోర్నీల్లో టైటిల్స్ సంపాదించారు.
 
ఈ క్రమంలో 2008 తర్వాత ఒకే సీజన్‌లో అత్యధికంగా తొమ్మిది టైటిల్స్ నెగ్గిన జంటగా సానియా-హింగిస్ గుర్తింపు పొందారు. 2008లో కారా బ్లాక్-లీజెల్ హుబెర్ ద్వయం 10 టైటిల్స్ సాధించింది. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో సానియా-హింగిస్ జంట 16 టోర్నీల్లో బరిలోకి దిగి... తొమ్మిదింటిలో టైటిల్ సాధించింది. ఈ ఏడాది సానియా మీర్జా నలుగురు వేర్వేరు (సు వీ సెయి, బెథానీ మాటెక్, కేసీ డెలాక్వా, మార్టినా హింగిస్) భాగస్వాములతో 22 టోర్నమెంట్‌లలో బరిలోకి దిగి 65 మ్యాచ్‌ల్లో గెలిచి, 12 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
 
కోర్టు లోపలే కాదు బయట కూడా మా ఇద్దరి మధ్య మంచి సమన్వయం, స్నేహం ఉంది. జీవితకాలం కష్టపడేది ఇలాంటి క్షణాల కోసమే. వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో సాధించిన ఈ విజయం అద్భుతం. ఆటతోపాటు అదృష్టం కూడా కలిసి రావడంతో ఈ ఏడాది మా జంటకు మంచి ముగింపు లభించింది.
-సానియా మీర్జా
 
ఈ రోజు మేమిద్దరం అద్భుతంగా ఆడాం. సానియా ఆటతీరును ఎంత ప్రశంసించినా తక్కువే. కోర్టులో అద్భుత కదలికలతో అనుక్షణం నాకు మద్దతుగా నిలిచింది. మంచి భాగస్వామి లభిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో సానియా నిరూపించింది.
-మార్టినా హింగిస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement