
సానియా జంటకే టైటిల్
హింగిస్‌తో కలిసి మరో ట్రోఫీ సొంతం
* ఇండో-స్విస్ జంటకు వరుసగా 40వ విజయం
సెయింట్ పీటర్స్‌బర్గ్ (రష్యా): వేదిక మారినా... ప్రత్యర్థి మారినా... ఫలితం మాత్రం మారలేదు. అద్వితీయమైన ఫామ్‌లో ఉన్న సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట తమ ఖాతాలో మరో టైటిల్‌ను జమచేసుకుంది. ఆదివారం ముగిసిన సెయింట్ పీటర్స్‌బర్గ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఈ ఇండో-స్విస్ ద్వయం విజేతగా నిలిచింది.
ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట 6-3, 6-1తో వెరా దుషెవినా (రష్యా) -బార్బరా క్రెజ్‌సికోవా (చెక్ రిపబ్లిక్) జోడీపై విజయం సాధించింది. సానియా-హింగిస్‌లకిది వరుసగా 40వ విజయం కావడం విశేషం. జతగా వీరిద్దరికిది 13వ డబుల్స్ టైటిల్. ఈ ఏడాది నాలుగోది.
ఈ సంవత్సరం సానియా-హింగిస్‌లు బ్రిస్బేన్ ఓపెన్, సిడ్నీ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ సాధించారు. విజేతగా నిలిచిన సానియా-హింగిస్ జోడీకి 40,170 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 27 లక్షల 36 వేలు)తోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఓవరాల్‌గా సానియా కెరీర్‌లో ఇది 36వ, హింగిస్ కెరీర్‌లో 54వ డబుల్స్ టైటిల్ కావడం విశేషం.