సానియా-హింగిస్ ‘సిక్సర్’ | Sania Mirza-Martina Hingis Start 2016 With a Bang, Win Brisbane International Title | Sakshi
Sakshi News home page

సానియా-హింగిస్ ‘సిక్సర్’

Published Sun, Jan 10 2016 2:32 AM | Last Updated on Sun, Sep 3 2017 3:23 PM

సానియా-హింగిస్ ‘సిక్సర్’

సానియా-హింగిస్ ‘సిక్సర్’

♦  వరుసగా ఆరో టైటిల్ నెగ్గిన ఇండో-స్విస్ ద్వయం
♦  బ్రిస్బేన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ సొంతం
♦  ఫైనల్లో కెర్బర్-పెట్కోవిచ్ జంటపై గెలుపు

 
 బ్రిస్బేన్: ఊహించినట్టే కొత్త ఏడాదిని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, స్విట్జర్లాండ్ మేటి క్రీడాకారిణి మార్టినా హింగిస్ టైటిల్‌తో ప్రారంభించారు. బ్రిస్బేన్ ఓపెన్ టోర్నమెంట్‌లో ఈ ఇండో-స్విస్ ద్వయం విజేతగా నిలిచింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ జోడీ 7-5, 6-1తో ఎంజెలిక్ కెర్బర్-ఆండ్రియా పెట్కోవిచ్ (జర్మనీ) జంటపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన సానియా జంటకు 45,990 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 30 లక్షల 76 వేలు)తోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.

♦  జోడీగా సానియా-హింగిస్‌లకిది వరుసగా ఆరో టైటిల్. గతేడాది యూఎస్ ఓపెన్, గ్వాంగ్‌జూ, వుహాన్, బీజింగ్, డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్స్ సాధించిన సానియా-హింగిస్ ఈ ఏడాది ఆడిన తొలి టోర్నీలోనే విజేతగా నిలిచారు.

♦  ఓవరాల్‌గా సానియా-హింగిస్ జంటకిది 10వ డబుల్స్ టైటిల్. సానియా కెరీర్‌లో ఇది 33 వ డబుల్స్ టైటిల్ కాగా... హింగిస్‌కు 51వది.
 ఈ ఇండో-స్విస్ జోడీకిది వరుసగా 26వ విజయం. మరోవైపు సానియా డబుల్స్ కెరీర్‌లో ఇది 401వ గెలుపు, హింగిస్‌కు 382వ విజయం.

♦  69 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సానియా-హింగిస్ రెండు ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదు సార్లు బ్రేక్ చేసి, తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. తొలి సెట్‌లో ఒకదశలో సానియా జంట 2-4తో వెనుకబడింది. అయితే వెంటనే తేరుకున్న ఈ ఇండో-స్విస్ జంట స్కోరును 4-4తో సమం చేసింది. ఆ తర్వాత 12వ గేమ్‌లో ప్రత్యర్థి జంట సర్వీస్‌ను బ్రేక్ చేసిన సానియా-హింగిస్ ద్వయం తొలి సెట్‌ను 43 నిమిషాల్లో దక్కించుకుంది. ఇక రెండో సెట్‌లో ప్రపంచ నంబర్‌వన్ జంటకు ఎదురులేకపోయింది. పూర్తి సమన్వయంతో ఆడిన సానియా-హింగిస్ ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది.

♦  బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గడం సానియా, హింగిస్‌లకిది రెండోసారి. గతేడాది సబైన్ లిసికి (జర్మనీ) భాగస్వామిగా హింగిస్ టైటిల్ నెగ్గగా... 2013లో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా) భాగస్వామిగా సానియా ఈ టైటిల్‌ను తొలిసారి సొంతం చేసుకుంది.

♦  1994 తర్వాత మహిళల డబుల్స్‌లో ఓ జంట వరుసగా 26 మ్యాచ్‌లు నెగ్గడం ఇదే ప్రథమం. చివరిసారి 1994లో నటాషా జ్వెరెవా
 (బెలారస్)-గీగీ ఫెర్నాండెజ్ (అమెరికా) ద్వయం వరుసగా 28 మ్యాచ్‌లు గెలిచింది.
 
 ‘‘ప్రత్యర్థి జంట పటిష్టంగా ఉండటంతో మా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిం చాలని తెలుసు. ఆరంభంలో వెనుకబడ్డా ఆ తర్వాత తేరుకున్నాం. 12వ గేమ్‌లో సర్వీస్ బ్రేక్ సాధించడం మ్యాచ్‌లో కీలక మలుపుగా భావిస్తున్నాను.’’  
                                                        -సానియా మీర్జా
 
 ‘‘సీజన్‌నులో విజయంతో ప్రారంభించడం మా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. బ్రిస్బేన్ టైటిల్ నెగ్గడం గొప్పగా అనిపిస్తోంది. వచ్చే వారం సిడ్నీ ఓపెన్‌లోనూ టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతున్నాం. అక్కడా టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నాం.’’  
                                                      -మార్టినా హింగిస్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement