'ఇక్కడ గ్యారంటీ ఏమీ ఉండదు'
రియో డీజనీరో: 'మనస్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం ఒక్కటే మన చేతుల్లో ఉంది. అంతేకానీ గెలుపు-ఓటములు ఎవ్వరూ చెప్పలేరు. అసలు క్రీడల్లో గ్యారంటీ అంటూ ఉండదు 'అని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వ్యాఖ్యానించింది. మహిళల డబుల్స్ లో భాగంగా తొలి రౌండ్ పోరులో ప్రార్థనా తోంబ్రే-సానియా మీర్జాలు ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం సానియా మాట్లాడుతూ.. గెలుపు-ఓటమి అనేది ఆటలో భాగమేనని తెలిపింది. తాను పతకం సాధించడానికి ఇంకా అవకాశం ఉందని, దాన్ని సాధించడం కోసం శ్రమిస్తానని సానియా పేర్కొంది. తాను ఎలా ఆడినా, భారత్ మాత్రం తన నుంచి స్వర్ణపతకం కోరుకుంటుందని వ్యాఖ్యానించింది.
మిక్స్డ్ డబుల్స్లో రోహన్ బోపన్నతో కలిసి ఆడతున్న సానియా.. పతకంపై ధీమా వ్యక్తం చేసింది. ఈ విభాగంలో కచ్చితంగా భారత్కు పతకం తీసుకొస్తామనే నమ్మకం ఉందని తెలిపింది. తమపై విమర్శల దాడి చేయడం ఆపి వాస్తవాన్ని గ్రహించాలని సానియా సూచించింది. ఒలింపిక్స్ లో తీవ్రమైన పోటీ ఉంటుందుంటి కాబట్టే అది ఒలింపిక్స్ అయ్యిందని, భారత్కు పతకం సాధించడం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్న సంగతి అభిమానులు గుర్తించుకోవాలని సానియా హితవు పలికింది.