‘కింగ్స్’ కోచ్ పదవికి బంగర్ రాజీనామా
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు చీఫ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న సంజయ్ బంగర్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న బంగర్ ఆధ్వర్యంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 2014లో రన్నరప్‌గా నిలిచి... గత రెండేళ్లలో ఆఖరి స్థానాన్ని సంపాదించింది. ‘గత నెలాఖర్లో నా రాజీనామాను సమర్పించాను. ఈ నెల రెండో వారంలో వాళ్లు నా వద్దకు వచ్చి చర్చించారు. ఇంగ్లండ్‌తో సిరీస్ కారణంగా బిజీగా ఉండటంతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని బంగర్ తెలిపారు.
కింగ్స్ ఎలెవన్ ఫ్రాంచైజీ సహ యజమానితో గొడవ కారణంగానే బంగర్ తన పదవికి రాజీనామా చేశాడని వార్తలు వచ్చాయి. అయితే బంగర్ వీటికి నేరుగా సమాధానం ఇవ్వలేదు. ‘టోర్నమెంట్ సమయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. వాటిలో కొన్ని సఫలమవుతాయి. మరికొన్ని బెడిసికొడతాయి. ఆటలో ఇలాంటివి సహజమే. గత రెండు సీజన్లలో మేము అనుకున్న ఫలితాలు సాధించలేదు. దాంతో కొత్త వారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో నేను తప్పు కున్నాను. వచ్చే సీజన్‌లో మరో ఫ్రాంచైజీకి కోచ్‌గా వ్యవహరిస్తానో లేదో ఇప్పుడే చెప్పలేను’ అని బంగర్ వివరించారు.