Sanjay bunger
-
25 శాతం మాకు సమ్మతం కాదు!
జీతాల పెంపుపై టీమిండియా సహాయక సిబ్బంది ముంబై: తమ వేతనాల పెంపుతీరుపై టీమిండియా సహాయక సిబ్బంది గుర్రుగా ఉన్నారు. ప్రస్తుత వేతనాన్ని 25 శాతం పెంచేందుకు బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి చేసిన ప్రతిపాదనను బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌లతో కూడిన సిబ్బంది తిరస్కరించినట్టు సమాచారం. గతంలో బోర్డు అధ్యక్షుడిగా ఉన్న అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కే వీరికి వంద శాతం పెంచుతామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత నెలకొన్న పరిస్థితుల కారణంగా వారు పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. దీంతో ఈ వ్యవహారంలో ప్రతిష్టంభన నెలకొంది. గతంలో తమకు లభించిన హామీతో పోలిస్తే తాజాగా జోహ్రి చేసిన ప్రతిపాదన చాలా తక్కువ అనే అసంతృప్తి వారి నుంచి వ్యక్తమవుతోంది. ‘బంగర్ సహా కొందరు టీమిండియా తరఫున మూడేళ్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికీ అదే జీతంతో వారు కొనసాగుతున్నారు. ఇది నిజంగా వీరిపై వివక్ష కొనసాగిస్తున్నట్టే అవుతుంది. చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా వారికి లభిస్తున్న వేతనాలను పెంచాల్సిందిగా అభిప్రాయపడుతున్నారు. ఇంతకుముందు బోర్డు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లేదు’ అని సహాయక సిబ్బంది వర్గాలు తెలిపాయి. మరోసారి బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) ఈ విషయంపై దృష్టి సారించనుంది. మరోవైపు గతేడాది జట్టు కోచ్‌గా ఎంపికైన కుంబ్లేకు ఏడాదికి రూ.6.5 కోట్ల వేతనాన్ని అందిస్తున్నారు. -
‘కింగ్స్’ కోచ్ పదవికి బంగర్ రాజీనామా
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు చీఫ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న సంజయ్ బంగర్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న బంగర్ ఆధ్వర్యంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 2014లో రన్నరప్‌గా నిలిచి... గత రెండేళ్లలో ఆఖరి స్థానాన్ని సంపాదించింది. ‘గత నెలాఖర్లో నా రాజీనామాను సమర్పించాను. ఈ నెల రెండో వారంలో వాళ్లు నా వద్దకు వచ్చి చర్చించారు. ఇంగ్లండ్‌తో సిరీస్ కారణంగా బిజీగా ఉండటంతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని బంగర్ తెలిపారు. కింగ్స్ ఎలెవన్ ఫ్రాంచైజీ సహ యజమానితో గొడవ కారణంగానే బంగర్ తన పదవికి రాజీనామా చేశాడని వార్తలు వచ్చాయి. అయితే బంగర్ వీటికి నేరుగా సమాధానం ఇవ్వలేదు. ‘టోర్నమెంట్ సమయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. వాటిలో కొన్ని సఫలమవుతాయి. మరికొన్ని బెడిసికొడతాయి. ఆటలో ఇలాంటివి సహజమే. గత రెండు సీజన్లలో మేము అనుకున్న ఫలితాలు సాధించలేదు. దాంతో కొత్త వారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో నేను తప్పు కున్నాను. వచ్చే సీజన్లో మరో ఫ్రాంచైజీకి కోచ్‌గా వ్యవహరిస్తానో లేదో ఇప్పుడే చెప్పలేను’ అని బంగర్ వివరించారు. -
బ్యాటింగ్ కోచ్‌గా బంగర్
ముంబై: భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా సంజయ్ బంగర్, ఫీల్డింగ్ కోచ్‌గా అభయ్ శర్మలను నియమిం చినట్లు బీసీసీఐ ప్రకటించింది. హెడ్‌కోచ్ అనిల్ కుంబ్లేను సంప్రదించిన తర్వాత వెస్టిండీస్ పర్యటన వరకు మాత్రమే ఈ ఇద్దరినీ నియమించింది. -
ప్రధాన కోచ్‌గా బంగర్
జింబాబ్వే పర్యటనకు ఎంపిక ఫీల్డింగ్ కోచ్‌గా అభయ్ శర్మ ముంబై: భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సంజయ్ బంగర్‌కు రాబోయే సిరీస్ కోసం ప్రమోషన్ లభించింది. జింబాబ్వేలో పర్యటించే టీమిండియాకు ఆయన ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తారు. భారత్‌కు కొత్త కోచ్‌ను ఎంపిక చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో తాత్కాలికంగా ఈ సిరీస్ వరకు బంగర్‌కు బీసీసీఐ బాధ్యతలు అప్పజెప్పినట్లు తెలుస్తోంది. జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా ఇప్పటి వరకు పని చేసిన ఆర్.శ్రీధర్‌ను బోర్డు తప్పించింది. అతని స్థానంలో ఢిల్లీకి చెందిన అభయ్ శర్మను ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపిక చేసింది. రైల్వేస్‌కు, ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్‌కు కోచ్‌గా వ్యవహరించిన అభయ్... భారత అండర్-19, భారత ‘ఎ’ జట్లకు ఇటీవలి వరకు ఫీల్డింగ్ కోచ్‌గా పని చేశారు. జింబాబ్వే పర్యటనకు భారత జట్టు మేనేజర్‌గా కోకా రమేశ్ (ఆంధ్ర)ను ఎంపిక చేశారు. టూర్లో ధోని సారథ్యంలోని భారత జట్టు 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు ఆడుతుంది. -
ప్రీతి నన్ను తిట్టలేదు: సంజయ్ బంగర్
న్యూఢిల్లీ: బెంగళూరు చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయినందుకు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఫ్రాంచైజీ సహ యజమాని ప్రీతి జింతా తనను తిట్టినట్లు వచ్చిన కథనాలను జట్టు కోచ్ సంజయ్ బంగర్ తోసిపుచ్చారు. మ్యాచ్ తర్వాత సహజంగా జరిగే చర్చలే తమ మధ్య జరిగినట్లు ఫేస్బుక్లో వివరణ ఇచ్చారు. ఉన్నవీ లేనివీ అన్నీ కలిపి తప్పుడు కథనాలు రాశారని ఆరోపించారు. మరోవైపు ప్రీతి కూడా ఈ కథనాలను ఖండించింది. ‘మా కోచ్‌ను తిట్టడం అవాస్తవం. నేను ఎలాంటి మాటలు అనలేదు. ఈ కథనాలు నిజం కాదు. నేను, సంజయ్ ఇద్దరమూ ఈ కథనాలు కొట్టిపారేసినా మళ్లీ పుడుతున్నాయి. ఈ వార్తలతో విసిగిపోయాను. కొంత మంది జర్నలిస్ట్‌లు సమయం చూసుకొని మరీ రాస్తున్నారు. సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకొని ఇలా చేస్తున్నారు’ అని ప్రీతి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. బెంగళూరుతో మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఎందుకు పంపలేదంటూ ప్రీతి జింతా... బంగర్‌ను బూతులు తిట్టిందంటూ ఓ ఇంగ్లిష్ పత్రిక కథనం రాసింది. -
ఆ ముగ్గురి కొనసాగింపు...!
బంగర్, శ్రీధర్, అరుణ్‌ల వైపే బోర్డు మొగ్గు ముంబై: భారత జట్టుకు సహాయక కోచ్‌లుగా విధులు నిర్వర్తిస్తున్న సంజయ్ బంగర్, బి.అరుణ్, ఆర్.శ్రీధర్‌లను కొనసాగించేందుకే బీసీసీఐ మొగ్గు చూపనుంది. రవిశాస్త్రి టీమ్ డెరైక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న అనంతరం ఈ త్రయం కూడా జట్టుతో పాటే చేరింది. వీరిలో బౌలింగ్ కోచ్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ల కాంట్రాక్ట్ రెన్యువల్‌పై ఇప్పటికే బోర్డు హామీ ఇచ్చినా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌పై స్పష్టత రాలేదు. ఒకరిద్దరు బ్యాట్స్‌మెన్ నుంచి బంగర్‌పై నెగటివ్ ఫీడ్‌బ్యాక్ రావడంతో ఆయన్ని మార్చాలని బోర్డు భావించింది. ఆమ్రే, రాజ్‌పుత్, రామన్‌లు ఈ రేసులో ఉన్నా బంగర్‌కు రవిశాస్త్రి సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో ఉద్వాసన తప్పిందని సమాచారం.