25 శాతం మాకు సమ్మతం కాదు!
జీతాల పెంపుపై టీమిండియా సహాయక సిబ్బంది
ముంబై: తమ వేతనాల పెంపుతీరుపై టీమిండియా సహాయక సిబ్బంది గుర్రుగా ఉన్నారు. ప్రస్తుత వేతనాన్ని 25 శాతం పెంచేందుకు బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి చేసిన ప్రతిపాదనను బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌లతో కూడిన సిబ్బంది తిరస్కరించినట్టు సమాచారం. గతంలో బోర్డు అధ్యక్షుడిగా ఉన్న అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కే వీరికి వంద శాతం పెంచుతామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత నెలకొన్న పరిస్థితుల కారణంగా వారు పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. దీంతో ఈ వ్యవహారంలో ప్రతిష్టంభన నెలకొంది. గతంలో తమకు లభించిన హామీతో పోలిస్తే తాజాగా జోహ్రి చేసిన ప్రతిపాదన చాలా తక్కువ అనే అసంతృప్తి వారి నుంచి వ్యక్తమవుతోంది. ‘బంగర్ సహా కొందరు టీమిండియా తరఫున మూడేళ్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇప్పటికీ అదే జీతంతో వారు కొనసాగుతున్నారు. ఇది నిజంగా వీరిపై వివక్ష కొనసాగిస్తున్నట్టే అవుతుంది. చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా వారికి లభిస్తున్న వేతనాలను పెంచాల్సిందిగా అభిప్రాయపడుతున్నారు. ఇంతకుముందు బోర్డు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లేదు’ అని సహాయక సిబ్బంది వర్గాలు తెలిపాయి. మరోసారి బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) ఈ విషయంపై దృష్టి సారించనుంది. మరోవైపు గతేడాది జట్టు కోచ్‌గా ఎంపికైన కుంబ్లేకు ఏడాదికి రూ.6.5 కోట్ల వేతనాన్ని అందిస్తున్నారు.