‘నాదైన రోజును నువ్వు నాశనం చేశావు!’ | Sanju Samson Talks To David Warner After RR Lost Match To SRH | Sakshi
Sakshi News home page

‘నాదైన రోజును నువ్వు నాశనం చేశావు!’

Published Sat, Mar 30 2019 11:54 AM | Last Updated on Sat, Mar 30 2019 6:35 PM

Sanju Samson Talks To David Warner After RR Lost Match To SRH - Sakshi

‘నాదైన రోజును నువ్వు నాశనం చేశావు డేవిడ్‌. నీ బ్యాటింగ్‌ ముందు నా సెంచరీ పనికిరాకుండా పోయింది. మీ ఇన్నింగ్స్‌ మొదలెట్టగానే పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ మా నుంచి చేజారిపోయింది. అయినా ప్రత్యర్థులుగా సన్‌రైజర్స్‌ వంటి పటిష్ట జట్టు ఉన్నపుడు మేము కనీసం 250 పరుగులు స్కోరు బోర్డు మీద ఉంచాల్సింది. అయినా నాకు ఇదొక ప్రత్యేకమైన రోజు’ అంటూ రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మెన్‌ సంజూ శాంసన్‌ సన్‌రైజర్స్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కాగా శుక్రవారం రాజస్తాన్‌ రాయల్స్‌పై సన్‌రైజర్స్‌ జట్టు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు విధించిన 198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ విజయం సాధించింది.

ఇక టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్తాన్‌ దూకుడుగా ఆడటంలో విఫలమైంది. అటువంటి సమయంలో సంజూ శాంసన్‌ కెప్టెన్‌ రహానేతో కలిసి మెరుపులు మెరిపించాడు. 58 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను బెయిర్‌స్టో వదిలివేయడంతో లైఫ్‌ పొందిన సంజు.. 54 బంతుల్లో సెంచరీ(55 బంతుల్లో 102 నాటౌట్‌) పూర్తి చేసి ఔరా అనిపించాడు. అయితే సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు డేవిడ్‌ వార్నర్‌(37 బంతుల్లో 69), బెయిర్‌ స్టో(45) విజృంభించడంతో సంజూ సెంచరీ వృథా అయింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం వార్నర్‌.. సంజును సరదాగా ఇంటర్వ్యూ చేయగా అతడు పైవిధంగా స్పందించాడు. ఇక ఓవరాల్‌గా ఐపీఎల్‌  చరిత్రలో ఇప్పటి వరకు 53 సెంచరీలు నమోదు కాగా సంజూ శాంసన్‌కిది రెండో సెంచరీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement