మెల్‌బోర్న్: తమ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ ఓడిపోవడం ఖాయమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ వా జోస్యం చెప్పాడు. అందుకు కారణాలను కూడా మార్క్ వా వెల్లడించాడు. ప్రధానంగా న్యూజిలాండ్ జట్టు ఒక అనవసరమైన బౌలర్‌ను తుది జట్టులో ఆడిస్తుందని విమర్శించాడు. ఆ బౌలర్ కారణంగా న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్‌ను చేజార్చుకోవడం ఖాయమన్నాడు. ఇంతకీ ఆ బౌలర్ ఎవరంటే.. స్పిన్నర్ మిచెల్ సాంత్నార్. అసలు మిచెల్ సాంత్నార్‌తో కివీస్‌కు ఒరిగేదేమీ లేదంటూ ఎద్దేవా చేశాడు. ‘ మిచెల్ సాంత్నార్ టెస్టు బౌలర్ కాదు. అతను కేవలం వన్డేలకు మాత్రమే సెట్ అవుతాడు. టెస్టు మ్యాచ్‌లకు సరిపోయే బౌలింగ్ సామర్థ్యం అతనిలో లేదు. నిజంగా సాంత్నార్ మంచి స్నిన్నర్ అయితే కచ్చితత్వం ఉండాలి. మరి అతనిలో అది లేదు. సాంత్నార్ ఎక్కువగా బంతిని స్పిన్ చేయలేడు. (ఇక్కడ చదవండి: దిమ్మ తిరిగే బంతి.. అదిరేటి క్యాచ్!)
టెస్టుల్లో బంతి ఎక్కువగా స్పిన్ చేస్తేనే కెట్లు లభిస్తాయి. సాంత్నార్ ఎక్కువగా షార్డ్ బంతుల్ని సంధిస్తున్నాడు. అది పరుగులు చేయడానికి ఈజీ అవుతుంది. స్పిన్‌లో వైవిధ్యమైన బంతులు వేయలేనప్పుడు ఏ బౌలర్ అయినా టెస్టుల్లో అనవసరం. మాతో జరుగుతున్న మ్యాచ్‌లో సాంత్నార్ అవసరం లేదు. ఈ కారణంతోనే న్యూజిలాండ్ మ్యాచ్‌ను కోల్పోవడం ఖాయం. ఆస్ట్రేలియాకు వచ్చే ఏ పర్యాటక జట్టుకైనా వికెట్లు సాధించే స్పిన్నర్లు కావాలి. సిడ్నీలో జరగబోయే తదుపరి టెస్టులో సాంత్నార్‌ను కివీస్ జట్టులో చూడాలనుకోవడం లేదు. ఒక లెగ్ స్పిన్నర్‌ను వేసుకోవడం మంచిది’ అని వా పేర్కొన్నాడు. ఈ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 467 పరుగులకు ఆలౌటైంది. నీల్ వాగ్నర్ నాలుగు వికెట్లు సాధించగా, టిమ్ సౌథీ మూడు వికెట్లు తీశాడు. గ్రాండ్ హోమ్‌కు రెండు వికెట్లు, ట్రెంట్ బౌల్ట్ వికెట్ తీశాడు. సాంత్నార్ 20 ఓవర్లు వేసి 82 పరుగులిచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment