వన్డే సిరీస్కూ సక్లాయిన్ సేవలు
కరాచీ:ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు స్పిన్ కన్సల్టెంట్గా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ దిగ్గజ స్సిన్నర్ సక్లాయిన్ ముస్తాక్ పదవీకాలం పొడిగిస్తూ ఈసీబీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న ఇంగ్లండ్ జట్టుకు స్పిన్ విభాగంలో సక్లయిన్ సహకారం అందిస్తున్నాడు. తొలుత ఈ టెస్టు సిరీస్ వరకూ సక్లయిన్ ను స్పిన్ కన్సల్టెంట్ గా నియమించిన ఈసీబీ.. వన్డేలకు అతని సేవలకు వినియోగించుకోవాలని భావించింది. ఆ క్రమంలోనే అతన్ని వన్డే సిరీస్ లో కూడా కొనసాగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇంగ్లండ్ జట్టు ప్రధాన స్పిన్నర్లు మొయిన్ అలీ, రషిద్లు.. సక్లయిన్ పర్యవేక్షణలో మెళుకవులు నేర్చుకుంటున్నారు.
తన పదవీ కాలం మరోసారి పొడగించడంపై సక్లయిన్ ఆనందం వ్యక్తం చేశాడు. తనకు ఇంగ్లండ్ జట్టుతో ఎటువంటి ఇబ్బందులు లేవని, బౌలింగ్ కోచ్ గా కానీ, కన్సల్టెంట్ కానీ బాధ్యతలు నిర్వర్తించడం ఒక మంచి అనుభూతి అని పేర్కొన్నాడు. స్పిన్ పాఠాలు నేర్చుకునేందుకు ఇంగ్లండ్ స్పిన్నర్లు చాలా ఆతృతగా ఉన్నారని, దానిలో భాగంగానే ఇప్పటికే వారు ఎంతో పురోగతి సాధించారన్నాడు.