విజయవాడ స్పోర్ట్స్: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కార్యవర్గం శుక్రవారం బాధ్యతలు స్వీకరించింది. ఏసీఏ అధ్యక్షుడిగా పి.శరత్‌చంద్రా రెడ్డి, ఉపాధ్యక్షుడిగా వీవీఎస్‌ఎస్‌కే యాచేంద్ర, కార్యదర్శిగా వి.దుర్గాప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా కేఎస్ రామచంద్రరావు, కోశాధికారిగా జి.గోపినాథ్‌రెడ్డి, కౌన్సిలర్‌గా ఆర్.ధనుంజయరెడ్డి పదవీబాధ్యతలు చేపట్టారు. ఈ నెల 23న జరిగిన ఎన్నికల్లో ఈ ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తరపున ఏసీఏ లీగల్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరాజు అధికారికంగా ఈ ఎంపికను ప్రకటించి సరి్టఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాజీ ఆఫీస్‌బేరర్లు గోకరాజు రంగరాజు, సీహెచ్.అరుణ్‌కుమార్ కొత్త కమిటీకి స్వాగతం పలికారు. తమ హయాంలో జరిగిన ఏసీఏ అభివృద్ధిని తెలిపిన వీరు కొత్త కమిటీ దీనిని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను వివరించారు.
ఇటీవలే రిటైరైన టీమిండియా మాజీ ఆటగాడు వై.వేణుగోపాలరావును కొత్త కార్యవర్గం ఘనంగా సన్మానించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి చేరుకున్నట్లు ఈ సందర్భంగా వేణుగోపాలరావు అన్నాడు. ఆంధ్ర నుంచి ఎక్కువ మంది దేశానికి ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. అసోసియేషన్ కొత్త అధ్యక్షుడు పి.శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ... క్షేత్ర స్థాయిలో క్రికెట్‌ను అభివృద్థి చేస్తామన్నారు. బా«ధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, పారదర్శకత పాటిస్తామని పేర్కొన్నారు. మిగిలిన కార్యవర్గం ప్రతినిధులు మాట్లాడుతూ, తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా శభాష్ అనిపించుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment