క్రీడాశాఖకు వన్నె తెస్తా
కేంద్ర క్రీడల మంత్రి సోనోవాల్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: క్రీడాశాఖను ప్రాధాన్యత కలిగిన శాఖగా మార్చడమే తన లక్ష్యమని కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ అన్నారు. తన విధుల్ని సక్రమంగా నిర్వర్తించేందుకు నిపుణులు, క్రీడాకారుల నుంచి సలహాలు తీసుకుంటానని చెప్పారు.
అస్సాం లఖీంపూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికై, ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సోనోవాల్ మంగళవారం ఢిల్లీలోని శాస్త్రి భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ఆచితూచి స్పందించారు. ‘మంత్రిగా ఇదే నాకు మొదటి రోజు.. క్రీడాశాఖకు వన్నె తెచ్చేందుకు మీతోపాటు ప్రతీ ఒక్కరి సహకారం కావాలి. భారత్ నుంచి మరింత మంది క్రీడాకారులు వెలుగులోకి రావాలని కోరుకుంటున్నా’ అని సోనోవాల్ అన్నారు.