భళా... యువ భారత్ | Sarfaraz Khan's Blitz Guides India to Under-19 Tri-Series Title | Sakshi
Sakshi News home page

భళా... యువ భారత్

Published Mon, Nov 30 2015 12:58 AM | Last Updated on Sun, Sep 3 2017 1:13 PM

భళా... యువ భారత్

భళా... యువ భారత్

 ‘అండర్-19 ముక్కోణపు సిరీస్’ హస్తగతం
 ఫైనల్లో ఏడు వికెట్లతో బంగ్లాదేశ్‌పై గెలుపు
 దుమ్మురేపిన సర్ఫరాజ్ ఖాన్
 
 కోల్‌కతా: సర్ఫరాజ్ ఖాన్ (27 బంతుల్లో 59 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) దుమ్మురేపడంతో... అండర్-19 ముక్కోణపు సిరీస్ టైటిల్‌ను భారత్ సొంతం చేసుకుంది. ఆదివారం జాదవ్‌పూర్ యూనివర్సిటీ మైదానంలో జరిగిన ఫైనల్లో ఆంధ్ర క్రికెటర్ రికీ భుయ్ నాయకత్వంలోని టీమిండియా ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచిన బంగ్లా 36.5 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. నజ్ముల్ శాంతో (66 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్), జోయ్‌రాజ్ షేక్ (28), జాకీర్ అలీ (24) మినహా మిగతా వారు నిరాశపర్చారు.
 
 భారత బౌలర్ల ధాటికి బంగ్లా మిడిల్, లోయర్ ఆర్డర్ చేతులెత్తేసింది. నలుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్‌కాగా, మరో నలుగురు సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యారు. మయాంక్ డాగర్ 3, శుభమ్ మావి, మహిపాల్ లోమ్‌రోర్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత భారత్ 13.3 ఓవర్లలో 3 వికెట్లకు 117 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్లలో వాషింగ్టన్ సుందర్ (12) విఫలమైనా.. రిషబ్ పంత్ (16 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. అమన్‌దీప్ కారె (0) నిరాశపర్చడంతో ఓ దశలో భారత్ 42 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
 
 అయితే కెప్టెన్ రికీ భుయ్ (20 బంతుల్లో 20 నాటౌట్; 4 ఫోర్లు), సర్ఫరాజ్ చెలరేగి ఆడారు. పసలేని బంగ్లా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపెట్టిన సర్ఫరాజ్.. నాలుగో వికెట్‌కు కేవలం ఏడు ఓవర్లలోనే అజేయంగా 75 పరుగులు జోడించి జట్టును గెలిపించాడు. సర్ఫరాజ్ ఖాన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’... నిలకడగా ఆడిన రిషబ్ పంత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ పురస్కారాలు లభించాయి. మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించిన భారత జట్టు ఈ టోర్నమెంట్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement